సాక్షరభారత్‌ ఉద్యోగులను ఆదుకోవాలి

ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బుగత అశోక్‌
విజయనగరం,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే.. చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బుగత అశోక్‌ హెచ్చరించారు. రోజుకో ప్రత్యేక రీతిలో
తమ నిరసనను ప్రకటిస్తున్న సాక్షర భారత్‌ ఉద్యోగులు శుక్రవారం మరో ప్రత్యేక రీతిలో ఉరితాళ్లతో నిరసన ప్రకటించారు. ఎఐటియుసి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణ కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్‌ వద్ద సాక్షర భారత్‌ ఉద్యోగులు ఉరితాళ్లతో నిరసన చేపట్టారు. గత అయిదు రోజుల నుండి సాక్షర భారత్‌ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షల్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ.. సాక్షర భారత్‌ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్‌ తో జిల్లా కేంద్రంలో అయిదు రోజులుగా రీలే నిరాహారదీక్షలు చేపడుతున్నారని తెలిపారు. అయిదు రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం చీమ కట్టినట్లు అయినా లేకపోవడం శోచ నీయమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కనీసం సాక్షర భారత్‌ ఉద్యోగుల అంశాలేవీ ప్రస్తావన చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాక్షర భారత్‌ ఉద్యోగులకు న్యాయం చేయకపోతే.. ఉద్యోగులకు ఆత్మహత్యలే శరణ్యమని సూచనగా.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియచేయడానికే ఈ ఉరితాళ్ల నిరసన కార్మికులు చేపట్టారని చెప్పారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే.. చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బుగత అశోక్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు టి.జీవన్న, బబ్బిలి, బాడంగి, తెర్లాం నుండి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.