సిఎం కెసిఆర్‌తో భేటీ అయిన ఇంటిలిజెన్స్‌ అధికారి


సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జన్నార్‌ బదిలీ
ఆర్టీసీ ఎండిగా నియామకం
సైబరాబాద్‌ నూతన కమిషనర్‌గా స్టీఫెన్‌ రవీంద్ర
హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): తెలంగాణ పోలీస్‌ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పలుబదిలీలు జరిగాయి. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌గా ఉన్న అనిల్‌ కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అదనపు డైరెక్టర్‌
జనరల్‌ (ఏడీజీ)గా ఆయనను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్న టీ ప్రభాకర్‌ రావు పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో అనిల్‌ కుమార్‌కు అవకాశం దక్కింది. అనిల్‌ కుమార్‌ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన బుధవారం ప్రగతి భవన్‌లో సిఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదిలావుంటే అనూహ్యంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను అంతగా ప్రాధాన్యం లేని టీఎస్‌ ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జనార్‌ మూడేళ్లపాటు సైబరాబాద్‌ సీపీగా పని చేశారు. ఇక సైబరాబాద్‌కు కొత్త సీపీగా స్టీఫెన్‌ రవీంద్రను ప్రభుత్వం నియమించింది. 1999 బ్యాచ్‌కు చెందిన స్టీఫెన్‌ రవీంద్ర ప్రస్తుతం వెస్ట్‌ జోన్‌ ఐజీపీగా ఉన్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ బదిలీ అయ్యారు. దాదాపు 3 ఏళ్లకు పైగా సైబరాబాద్‌ కమిషనర్‌గా సేవలు అందించిన సజ్జనార్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఉత్వర్వులు జారీ చేశారు. సజ్జనార్‌ స్థానంలో సైబరాబాద్‌ కమిషనర్‌గా 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ముత్యాల స్టీఫెన్‌ రవీంద్రను నియమిస్తున్నట్లు ఆ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. కీలకమైన కేసులను పరిష్కరించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించి సజ్జనార్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మహిళల రక్షణకు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో సజ్జనార్‌ ఒక్కసారిగా సంచలనంగా మారారు. అంతకుముందు వరంగల్‌లో యాసిడ్‌ దాడి నిందితుడి ఎన్‌కౌంటర్‌తోనూ ఆయన గుర్తింపు పొందారు. సజ్జనార్‌ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. కీలకమైన కేసులను కూడా పరిష్కరించిన ఐపీఎస్‌గా సజ్జనార్‌కు పేరుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో స్టీఫెన్‌ రవీంద్ర కఠినంగా వ్యవహరించి ఉద్యమకారులను తరిమికొట్టారు. ఆయన ఎపికి వెళతారని అప్పట్లో ప్రచారం జరిగింది.