సిక్కుల ఊచకోతలో తొలితీర్పు

ఇద్దరు వ్యక్తులకు శిక్షలు ఖరారు

న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన ఊచకోత కేసులో కోర్టు ఇద్దరికి శిక్షలు ఖరారు చేసింది. ఢిల్లీలోని మహీపాల్‌ పూర్‌లో ఇద్దరు సిక్కులను హత్య చేసిన కేసులో యశ్‌పాల్‌ సింగ్‌, నరేశ్‌ షేరావత్‌ దోషులని ఈ నెల 15న కోర్టు నిర్థారించిన సంగతి తెలిసిందే. వీరిలో యశ్‌పాల్‌కు మరణ శిక్ష, నరేశ్‌కు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం ఢిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టు తీర్పు చెప్పింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు చేపట్టిన తర్వాత 1984 సిక్కుల ఊచకోత కేసుల్లో దోషులకు శిక్ష పడటం ఇదే తొలిసారి. దీంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సర్‌దేవ్‌ సింగ్‌, అవతార్‌ సింగ్‌లను యశ్‌పాల్‌, నరేశ్‌ హత్య చేసినట్లు నమోదైన కేసులో ఈ తీర్పు వెలువడింది. కేసులో సాక్ష్యాధారాలు లేవని చెప్తూ ఢిల్లీ పోలీసులు 1994లో దర్యాప్తును ముగించారు. అయితే సిట్‌ మళ్ళీ దర్యాప్తును పునరుద్ధరించింది. పాతికేళ్ళ యువకులను అన్యాయంగా హత్య చేశారని సిట్‌ పేర్కొన్నట్లు సమాచారం.