సిగ్నేచర్‌ బ్రిడ్జిపై మరో ప్రమాదం


– డివైడర్‌ను ఢీకొన్న బైక్‌..  యువకుడు మృతి
– ప్రారంభమైన 24గంటల్లో ఇది రెండోప్రమాదం
న్యూఢిల్లీ, నవంబర్‌24(జ‌నంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల నూతనంగా ప్రారంభమైన సిగ్నేచర్‌ బ్రిడ్జి వరుస ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. శుక్రవారం ఇద్దరు యువకులను బలిగొన్న బైక్‌ ప్రమాదం మరువక ముందే శనివారం ఉదయం జరిగిన మరో ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నంగ్లోయ్‌ నుంచి ఈశాన్య ఢిల్లీ వైపు వెళ్తున్న శంకర్‌ (24), దీపక్‌ (17) అనే ఇద్దరు యువకులు తమ బైక్‌ అదుపు తప్పడంతో డివైడర్‌ను బలంగా ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ సవిూపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శంకర్‌ పరిస్థితి అప్పటికే విషమించడంతో చికిత్స పొందుతూనే మృతిచెందాడు. అతడితో పాటు బైక్‌ ప్రయాణించిన దీపక్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. కాగా సిగ్నేచర్‌ బ్రిడ్జిపై గత 24 గంటల్లో ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. శుక్రవారం ఓ స్పోర్ట్స్‌ బైక బ్రిడ్జిపై నుంచి పడిపోవడంతో ఇద్దరు మెడికల్‌ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తున్న బైక్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో.. దాదాపు 40 అడుగుల ఎత్తునుంచి ఇద్దరూ కింద పడిపోయారు. మితివిూరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమనీ, ప్రమాద సమయంలో విద్యార్ధులు హెల్మెట్‌ ధరించలేదని పోలీసులు పేర్కొన్నారు. దేశంలోని తొలి కేబుల్‌ వంతెనగా గుర్తింపు పొందిన సిగ్నేచర్‌ బ్రడ్జిని ఈ నెల 5న సీఎం కేజీవ్రాల్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే.