సిసి కెమెరాలతో నేరాల అదుపు
నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్
హైదరాబాద్,డిసెంబర్16 (జనం సాక్షి) : హైదరాబాద్ నగరం సేఫ్ నగరంగా ఉండడానికి ’నేను సైతం’లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. గురువారం జాంబాగ్‌లోని అప్జల్‌గంజ్, సుల్తాన్ బజార్ పోలీసుస్టేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ’నేను సైతం’లో భాగంగా 60 సీసీ కెమెరాలను నగర సీపీ అంజనీకుమార్, వెస్ట్ జోన్ జాయింట్ సీపీ రమేష్‌రెడ్డి, సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్‌లతో కలసి ప్రారంభించారు. నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాలు ఉపయోగంపడడంతో పాటు నేరస్తులను త్వరగా పట్టుకోవచ్చని అన్నారు. నూతన సంవత్సర వేడుకలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంబురాలు జరుపుకోవాలని సూచించారు. వేడుకలో యువత మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలను తల్లిదండ్రులు తమ పర్యవేక్షణలో చూసుకోవాలని సీపీ అంజనీకుమార్ సూచించారు.