సీఎం స్థాయిలోని వ్యక్తి.. అబద్దాలు ఆడటం సరికాదు

– 24గంటల విద్యుత్‌ ఇస్తే తెరాసలో చేరతానని నేనెప్పుడూ అనలేదు
– నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి) : సీఎం స్థాయిలోఉన్న వ్యక్తి అబద్దాలు వల్లిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి మండిపడ్డారు. శనివారం గాంధీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులకు 24గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తే గులాబీ జెండా పట్టుకుంటానని తాను చెప్పలేదని, కావాలంటే రికార్డులు పరిశీలించాలని జానారెడ్డి తెలిపారు. తాను టీఆర్‌ఎస్‌ జెండా పట్టుకుంటానని ఎప్పుడు చెప్పలేదని స్పష్టం చేశారు. నిజంగా ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి అబద్దాలు ఎలా చెబుతారని నిలదీశారు. ఇష్టానుసారంగా  మాట్లాడుతున్న కేసీఆర్‌ ఆత్మ విమర్శన చేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ అసత్యపు ప్రచారంతో ప్రజల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 2లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించకుంటే తాను ఎన్నికల్లో ఓట్లు అడగనని కేసీఆర్‌ చెప్పారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ముందస్తు ఎన్నికలకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలకు వెళ్తే ప్రజల తమ నిజస్వరూపాన్ని గ్రహించి తరమికొడతారని అనుకొనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని అన్నారు. అయినా ప్రజలు ఇప్పటికే కేసీఆర్‌ మాయ మాటలను గ్రహించారని త్వరలో జరగబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పి తెరాసను రాష్ట్రం నుంచే తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని జానారెడ్డి పేర్కొన్నారు.