సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
మహాసభల కరపత్రాలు ఆవిష్కరించిన సీపీఐ నేతలు
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 11 : ఈ నెల 17న సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే సీపీఐ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26న మార్క్సిజం లేనినిజం సిద్ధాంతంగా సోషలిజమే ధ్యేయంగా ఆవిర్భవించిన సీపీఐ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, సమ సమాజ స్థాపనే ధ్యేయంగా నాడు తెల్లదొరల బానిస పాలన నుండి దేశ విముక్తి కోసం, వెట్టిచాకిరి, బానిసత్వం, జమిందార్, జాగిర్ధర్, భూస్వామ్య, 7తరాల నిజాం నవాబు పాలనను అంతమొందించి తరిమికొట్టిన చరిత్ర సిపిఐ కి మాత్రమే దక్కిందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి 4,500 మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం చేసిన గొప్ప చరిత్ర ఉందన్నారు. నేడు కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టాక ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. ధరలు, పన్నుల రూపంలో ప్రజల రక్తాన్ని పీల్చుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో పాటు స్థానిక సమస్యలపై ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సీపీఐ మండల సహాయ కార్యదర్శులు బండారి సిద్ధులు, పొన్నబోయిన మహేందర్, మండల నాయకులు పుల్లని వేణు, గూడెపు సుదర్శన్, గజ్జల సురేందర్, కొంగరి ప్రతాప్, ఎండి.జహులామద్దీన్, ముస్త్యాల శంకరయ్య, జూకంటి చంద్రం, కిష్టయ్య, రాములు,వెంకటేశం, రవి తదితరులు పాల్గొన్నారు.