సీబీఐని దిగజార్చిన ఘనత మోదీదే
– నేడు రాఫెల్ స్కాం, ఇతర అంశాలపై జిల్లాల్లో నిరసనలు
– టీడీపీ, బీజేపీ కలిసి అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేస్తున్నాయి
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, అక్టోబర్23(జనంసాక్షి) : సీబీఐని దిగజార్చిన ఘనత మోదీకే దక్కుతుందని సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంగళవారం విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సీబీఐ అధికారుల అవినీతిపై దర్యాప్తు సిగ్గుచేటన్నారు. రాఫెల్ స్కాం, సీబీఐ అవినీతి, ఇతర అంశాలపై బుధవారం జిల్లాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అగ్రిగోల్డ్‌పై టీడీపీ, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీలో రాంమాధవ్ గంటసేపు సమావేశం పెడితే సమస్యకు పరిష్కారం అవుతుందని, చంద్రబాబు దుబారా ఖర్చులాపితే బాధితులకు న్యాయం చేయవచ్చని సూచించారు. నవంబర్ 1, 2 తేదీల్లో అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు చేయనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. భాజపా నాయకులకు ఉన్నట్లుండి రాయలసీమ గుర్తుకొచ్చిందని, వారికి రాయలసీమ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అగ్రిగోల్డ్ చేస్తున్న భాజపా దీక్షలు దొంగదీక్షలని రామకృష్ణ విమర్శించారు. ‘అరవింద సమేత’ సినిమాలో రాయలసీమను కించపర్చే అంశాలు లేవనిరామకృష్ణ వ్యాఖ్యానించారు. తాను రాయలసీమ వాడినని, అరవింద సమేతలో ఫ్యాక్షనిజం లేదని అన్నారు. ప్రశాంతత కోరుకునే వారందరితో కలిసి.. రాయలసీమలో ఫ్యాక్షనిజంను లేకుండా చేయొచ్చన్నది సినిమా సారాంశమని ఆయన అన్నారు. రాయలసీమపై మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదని రామకృష్ణ పేర్కొన్నారు