సుప్రీంకు అందిన అలోక్‌వర్మ నివేదిక లీక్‌

లీక్‌పై మండిపడ్డ సుప్రీం చీఫ్‌ జస్టిస్‌

దీనిపై వివరణ ఇవ్వాలన్న జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌

న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ కోర్టుకు ఇచ్చిన రహస్య నివేదిక విూడియాకు లీకవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముందే ఎలా లీకయ్యిందని ప్రశ్నించింది. తనను విధుల నుంచి తప్పించి, సెలవుపై పంపించిన ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలోక్‌ వర్మ వేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరుపుతున్నది. దీనికి సంబంధించి కోర్టుకు తన వాదనను సీల్డ్‌ కవర్‌లో అలోక్‌ వర్మ అందించారు. అయితే అంతకుముందే అది ఓ న్యూస్‌ పోర్టల్‌కు లీకవడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. విూలో ఎవరూ విచారణకు అర్హులు కారు అంటూ చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. అసలు ఈ సమాచారం బయటకు ఎలా వెళ్లిందో చెప్పాలని అలోక్‌ వర్మ తరఫున వాదిస్తున్న అడ్వొకేట్‌ ఫాలి నారిమన్‌ను కోర్టు ప్రశ్నించింది. ఇది తనను కూడా షాక్‌కు గురి చేసిందని ఆయన చెప్పారు. విూడియా కచ్చితంగా బాధ్యతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా నారిమన్‌ అన్నారు. తాను వర్మ నివేదికను కోర్టులో సమర్పించడానికి మరింత సమయం కోరినట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. మరోవైపు సీబీఐ సీనియర్‌ అధికారి ఎంకే సిన్హా ఈ వివాదంలోకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌, కేంద్ర మంత్రి హరిభాయ్‌ పార్థీభాయ్‌ చౌదరి, విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరి పేర్లను తీసుకురావడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈయనను నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు. దీనిని సవాలు చేస్తూ సిన్హా సుప్రీంకు వెళ్లారు. ఈయన సీబీఐ నంబర్‌ 2 ఆస్థానాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌తోపాటు పీఎన్‌బీ స్కాంలాంటి ముఖ్యమైన కేసులపై విచారణ జరుపుతున్నారు. అయితే ఆస్థానాపై విచారణలో భాగంగా అజిత్‌ ధోవల్‌, హరిభాయ్‌ పార్థిభాయ్‌, కేవీ చౌదరి జోక్యం చేసుకున్నారని సుప్రీంలో వేసిన పిటిషన్‌లో సిన్హా ఆరోపించారు.