సుభిక్షంగా ఉండాలంటే.. 

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
– ఇప్పుడు మొక్కలు నాటి పెంచితే భావితరాలకు మేలు చేసినవారమవుతాం
– భూపాలపల్లిలో గతేడాది లక్ష్యానికి మించి మొక్కలు నాటాం
– ఈ ఏడాది అదే తరహాలో మొక్కలు నాటాలి
– ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలి
– తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి
– రేగొండ మండలం పాండవుల గుట్టలో మొక్కలు నాటిన స్పీకర్‌, కలెక్టర్‌
భూపాలపల్లి, ఆగస్టు14(జ‌నం సాక్షి) : భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఈ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనచారి పిలుపునిచ్చారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పాండవుల గుట్టలో అటవీశాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా స్పీకర్‌, జిల్లా కలెక్టర్‌ అమేయ కుమార్‌, డీఎఫ్‌వో రవికిరణ్‌, విద్యార్థులు మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. తెలంగాణ ప్రజలకు, ప్రకృతికీ మధ్య అవినాభావ సంబంధం ఉందని, అందుకే వనదేవతలను కొలుస్తామన్నారు. గత సంవత్సరం భూపాలపల్లిలో 40 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా, టార్గెట్‌ ను అధిగమించి 55 లక్షల మొక్కలు నాటామని స్పీకర్‌ మధుసూదనాచారి వెల్లడించారు. ఈ సంవత్సరం ఇప్పటికే 17 లక్షల మొక్కలు వివిధ ప్రాంతాల్లో నాటారని తెలిపారు. గతంలో విచక్షణారహితంగా చెట్లను నరకడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూపాలపల్లిలో ఎక్కువ శాతం అడవులు ఉండడం వల్ల వర్షాలు ఎక్కువగా కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో హరితహారాన్ని విజయవంతం చేసి భవిష్యత్‌ తరాలకు వర్షాభావ పరిస్థితుల నుండి కాపాడాలని కోరారు. సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పంతో
హరితహారం కార్యక్రమం మొదలుపెట్టారని, అందరూ కలిసికట్టుగా విజయవంతం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
—————————