సెంటినెలీస్‌ తెగ ప్రజలు తెలివైన వారు

 

– ఒక్కసారి చేసిన తప్పు మళ్లీ చేయరు

– చాలా ప్రమాదకారులు

– తనకెదురైన అనుభవాలను వెల్లడించిన కమాండెంట్‌

న్యూఢిల్లీ, నవంబర్‌24(జ‌నంసాక్షి) : అమెరికా పౌరుడిని అత్యంత కిరాతకంగా చంపిన సెంటినెలీస్‌ తెగ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అండమాన్‌ నికోబార్‌ ద్వీపాల్లోని ఓ చిన్న ద్వీపమైన సెంటినెల్‌లో అటవీ ప్రాంతంలో ఉండే ఈ ఆదిమ తెగ వారు బయటి వ్యక్తులు కనిపిస్తే దాడి చేసి చంపేస్తారు. అలాంటి వారిని అత్యంత దగ్గరగా చూసిన తీరప్రాంత రక్షక దళ కమాండెంట్‌ ప్రవీణ్‌ గౌర్‌ గతంలో తనకు జరిగిన అనుభవాలను తాజా పరిమాణాల నేపథ్యంలో వెల్లడించారు. 2006లో ఇద్దరు మత్స్యకారులతో వెళ్లిన పడవ పోర్ట్‌ బ్లెయిర్‌లోని ఓ గ్రామం నుంచి బయలుదేరి కనిపించకుండా పోయింది. దీంతో దానిని వెతికే పనిని అధికారులు కమాండెంట్‌ ప్రవీణ్‌కు అప్పగించారు. దీంతో ఆయన చేతక్‌ హెలికాప్టర్‌లో కొందరు సిబ్బంది సాయంతో వెతకడం ప్రారంభించారు. అప్పటి ఆయన అనుభవాలు

‘సెంటినెల్‌ ద్వీపం ఉత్తర, దక్షిణ ప్రాంతాలన్నీ గాలించాం. సెంటినెల్‌ ఉత్తరం వైపు కొంచెం దగ్గరగా వెళ్తుండగా మాకు పడవ ఉన్నట్లు కనిపించింది. ఇంకా దగ్గరి నుంచి చూద్దామని హెలికాప్టర్‌ను కొంచెం కిందకు దించాం. అప్పటికే మాకు సెంటినెలీస్‌ తెగ నుంచి ఎదురయ్యే ప్రమాదాల గురించి తెలుసు. అయితే కనిపించకుండా పోయిన మత్స్యకారుల గురించి ఆచూకీ లేదా ఏదైనా క్లూ లభిస్తుందని హెలికాప్టర్‌ను బీచ్‌లో దించాలని అనుకున్నాం. హెలికాప్టర్‌ను ఇంకాస్త కిందకు దించేసరికి ఆ తెగ వారు బాణాలతో మమ్మల్ని వెంబడించడం ప్రారంభించారు. వాళ్ల బాణాలు దాదాపు వంద అడుగుల ఎత్తు వరకు వచ్చాయి. దీంతో ఎ/-లాన్‌-బి అమలు చేయాలని అనుకున్నామని ప్రవీణ్‌ తెలిపారు. దాదాపు 50 మంది సెంటినెలీస్‌ తెగ వారు మాపై దాడి చేసేందుకు ప్రయత్నించారని, వాళ్లు ఏదో ఎరుపు రంగు వస్త్రం నడుము చుట్టూ కట్టుకున్నట్లు కనిపించిందన్నారు. వారిలో మహిళలెవరూ లేరని, ప్లాన్‌-బి ప్రకారం.. నేను హెలికాప్టర్‌ను పడవ ఉన్న ప్రదేశానికి దూరంగా తీసుకెళ్లడం ప్రారంభించానని తెలిపాడు. దాదాపు కిలోవిూటరున్నర కంటే ఎక్కువ దూరం వెళ్లానని, వాళ్లు కూడా హెలికాప్టర్‌ను వెంబడిస్తూ వచ్చారని తెలిపాడు. దీంతో నేను వెంటనే హెలికాప్టర్‌ వెనక్కి మళ్లించి తిరిగి బోటు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాని, వాళ్లు చాలా దూరం

వెళ్లినందున వెంటనే తిరిగి రాలేరని, కాబట్టి నేను పడవ సవిూపంలో హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేశానని తెలిపార. పడవకు కొద్ది దూరంలో గుంతల్లాగా కనిపించిందని, వాటిని పరిశీలించాలని సిబ్బందితో చెప్పానని, వాటిని తవ్వి చూడగా ఓ వ్యక్తి మృతదేహం కనిపించిందని, పడవకు సంబంధించిన తాడుతో ఉరి వేసి చంపినట్లుగా అనిపించిందన్నారు. ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, మరో గుంత తవ్వుతుండగా తెగ వాళ్లు తిరిగి వస్తున్నట్లు అర్థమైందని, దీంతో వెంటనే ఆ మృతదేహాన్నితీసుకుని తిరిగి హెలికాప్టర్‌ టేకాఫ్‌ చేసి అక్కడి నుంచి వచ్చేశామని ప్రవీణ్‌ వివరించారు. పోర్ట్‌ బ్లెయిర్‌లో మత్స్యకారుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని, కానీ మరో మృతదేహం కోసం మళ్లీ ద్వీపానికి వెళ్లామన్నారు. ఈసారి మా ప్లాన్‌ వాళ్లకి తెలిసిపోయిందని, బోటు దగ్గర కొందరు ఉండి హెలికాప్టర్‌ను మరికొందరు వెంబడించడం మొదలుపెట్టారన్నారు. బాణాలు మరింత వేగంగా మా హెలికాప్టర్‌పై పైకి సంధించారని, దీంతో మరో అవకాశం లేక మా సిబ్బందిని కాపాడడం ప్రధాన కర్తవ్యంగా భావించి వెను దిరిగానని తెలిపాడు. సెంటినెలీస్‌ తెగ వారు చేసిన పొరపాటు మళ్లీ చేయరని, మా ప్లాన్‌ను అర్థంచేసుకుని తిప్పి కొడతారని, రెండు గ్రూపులుగా విడిపోయి కొందరు పడవ దగ్గర ఉంటారని ఊహించలేదని ప్రవీణ్‌ తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. 2006లో భారత ప్రభుత్వం ప్రవీణ్‌ను త్రతక్షక్‌ మెడల్‌తో సత్కరించింది.