సెంటిమెంట్ విమర్శలపై కోదండాస్త్రం
కోదండరామ్‌కు కన్వీనర్ బాధ్యతల అప్పగింత
కాంగ్రెస్,టిడిపి వ్యూహాత్మక విజయం
ఎన్నికల్లో కెసిఆర్‌ను దీటుగా తిప్పికొట్టే వ్యూహం
హైదరాబాద్,నవంబర్12(జనంసాక్షి): శాసనసభ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల ఘట్టం మొదలయ్యింది. అయినా కాంగ్రెస్ కూటమిలో తొలుత లుకలుకలు కనిపించాయి. టిఆర్‌ఎస్ దూసుకుని పోతుంటే సీట్ల పంచాయితీ దగ్గరే మహాకూటమి పక్షాలు నిలిచిపోయాయన్న ప్రచారం సాగింది. అయినా వీటిని ఏవీ కూడా కూటమి నేతలు లెక్కచేయలేదు. ప్రజల్లో ఎంతగా చర్చ సాగితే అంత మంచిదన్న భావనలో ఉన్నారు. అయితే అనూహ్యంగా కోదండరామ్‌ను మహాకూటమికి కన్వీనర్‌గా ప్రకటిం చిన కూటమి నేతలు అధికార టిఆర్‌ఎస్‌కు కొంత ఇబ్బందికర పరిస్థితులను సృష్టించారు. ఇంతకాలం ఒంటరిగా టిఆర్‌ఎస్ పాలనపై విమర్శలు చేస్తున్న కోదండరామ్ ఇప్పుడు కూటమి కన్వీనర్‌గా తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు ఎలా దెబ్బతిన్నాయో మరింత జోరుగా ప్రచారంచేసే అవకాశం వచ్చింది. రాజకీయంగా ఈ నిర్ణయం మహాకూటమికి బాగా కలసివస్తుందనడంలో సందేహం లేదు. ఎన్నికలను కలిసికట్టుగానే ఎదుర్కొంటాయని, కూటమి మనుగడపై ఎలాంటి సందేహం వద్దని ప్రకటించడంతో పాటు కోదండరామ్ తమ నాయకుడని చెప్పడం ద్వారా బలమైన ప్రత్యర్థులమని చాటారు. ఇక అసంతృప్తులను కూడా ఓదార్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంలోనూ అందరికీ భాగస్వామ్యం ఉంటుందనీ స్పష్టం చేశారు. కూటమిపై పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలు ఊహాజనితమని
కొట్టిపారేశారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కలిగించడమే లక్ష్యంగా మహాకూటమి ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనే ప్రధాన అజెండాగా కూటమి ఏర్పడిందని గుర్తు చేశారు. దీనికితోడు కేసీఆర్ పాలనలో మేలు జరగలేదనే భావన ప్రజల్లో ఉంది. కోదండరాం పట్ల అవమాన వైఖరిని సమాజం మొత్తం ఖండిస్తోంది. హరగోపాల్, గద్దర్, విమలక్క త్యాగస్ఫూర్తితో పనిచేసినా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వారిని అవమానించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 1200 మంది చనిపోయారని కేసీఆర్ పదేపదే చెప్పారు. అమరుల కుటుంబాలకు పరిహారం, ఇళ్లు మాత్రం ఇవ్వలేదు. కేసీఆర్, మోదీ కలిసి కుట్రపూరితంగా ముందస్తు ఎన్నికలు ప్రకటించారు. 9 నెలల ముందుగా ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో స్పష్టమైన జవాబు చెప్పలేకపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీతో పొత్తు కోసం మైనారిటీలను మోసం చేసి మాయమాటలతో ఎన్నికల్లో గెలవాలనే కుట్రతో ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న ప్రచారం ఇప్పుడు కూటమి నేతలు మొదలు పెట్టారు. గత నాలుగున్న రేళ్లలో కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులేమిటో చెప్పాలని నిలదీయబోతున్నారు. నేరెళ్లలో దళితులకు కరెంటు షాకులు, ఖమ్మంలో రైతులకు బేడీలేయడం వంటివి కూడా ప్రచారంలో ప్రధానాంశం కాబోతున్నా యి. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాక వస్తున్న విమర్వలకు ఇప్పుడు కోదండరామ్ కన్వీనర్‌గా ఘాటుగానే సమాధానం ఇచ్చే అవకాశాలు వచ్చాయి. కోదండరామ్‌ను ఎంతగా విమర్విస్తే టిఆర్‌ఎస్‌కు అం మైనస్ కావడం ఖాయం. విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుందని కాంగ్రెస్ నాయకులు ముందుగానే అంచనా వేసుకుని కోదండను కన్వీనర్‌గా వేసి రాజకీయ వ్యూహం చాటారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను తమతో కలుపుకోవాలని నిర్ణయించుకోవడమే వ్యూహాత్మక విజయంగా చెప్పుకోవాలి. కోదండరామ్ తమతో ఉంటే కెసిఆర్ విమర్వలకు గట్టిగా ప్రతి విమర్శలు చేయవచ్చన్నది కాంగ్రెస్ నాయకుల ఆలోచనగా ఉన్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరామ్ పోషించిన పాత్ర వల్ల ఆయనకు తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే కూటమికి నాయకత్వ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ ఆయనకు అప్పగించింది. టీఆర్‌ఎస్ నాయకులు తొలుత కోదండరామ్‌ను టార్గెట్ చేసుకుని మూడు, నాలుగు సీట్లకోసం రాహుల్ గాంధీ, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారని విమర్శలు చేసి వెనకడుగు వేశారు. ఈ ఎన్నికలలో తమ గెలుపు సులువు అవుతుందని టీఆర్‌ఎస్ ముఖ్యులు బలంగా నమ్ముతున్నారు. ఇకమరోవైపు ప్రచారంలో చంద్రబాబు ముందుకు వస్తున్నారు. ఇది కూడా కూటమికి కలసి వచ్చే అంశం.