సైక్లోన్‌ ఫొని తుపాన్‌ను..  సమర్థవంతంగా ఎదుర్కొన్నారు

– భారత వాతావరణ శాఖకు ఐరాస ప్రశంసలు
న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : సైక్లోని ఫొని తుఫాన్‌ను భారత వాతావరణ శాఖ సమర్థవంతంగా ఎదుర్కొందని ఐరాసలోని డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ విభాగం(ఓడీఆర్‌ఆర్‌) శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సైక్లోన్‌ వంటి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత ప్రభుత్వం అనుసరించిన ‘జీరో క్యాజువాలిటీ’ విధానం, అత్యంత ఖచ్చితత్వంలో భారత వాతావరణ విభాగం ప్రజలను అప్రమత్తం చేస్తూ చేసిన హెచ్చరికలే ‘సైక్లోన్‌ ఫొని’ ప్రభావాన్ని అడ్డుకున్నాయని ప్రశంసించింది. ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో వారు అద్భుతమైన  పనితీరును కనబరిచారని ఓడీఆర్‌ఆర్‌ ప్రతినిధి డెనీస్‌ మెక్‌క్లీన్‌ జెనీవాలో విూడియాతో మాట్లాడుతూ భారత వాతావరణ శాఖను అభినందించారు. అత్యంత ఖచ్చితత్వంతో వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరికల వల్ల 11లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారని పేర్కొన్నారు. తీవ్రమైన భీకర గాలులు, తుపానుతో ఒడిశా ప్రజలను వణికించిన ఫొని వల్ల సంభవించిన మరణాలు శనివారం నాటికి 10 కంటే తక్కువగా ఉన్నాయని అన్నారు. ఫొని అత్యంత తీవ్రంగా ఉన్నప్పటికీ మరణాల రేటు 45 కంటే తక్కువగా ఉందని డెనిస్‌ వెల్లడించారు. ఒడిశా తీరంలో 1999లో వచ్చిన సూపర్‌ సైక్లోన్‌ 10వేల మంది మరణాలకు కారణమైందని, భారత్‌ పాఠాలు నేర్వడంతో 2013లో ఫైలిన్స్‌ వల్ల సంభవించిన మరణాల సంఖ్య అతి తక్కువగా ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యుఎమ్‌ఓ) ప్రతినిధి క్లేర్‌ నలిస్‌ తెలిపారు.