సైలెంట్‌గా రాజకీయాలు నెరపుతున్న రేవంత్
అనూహ్యంగా కాంగ్రెస్‌లో కీలక నేతగా దూకుడు
అధికార టిఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా ప్రణాళికలు
హైదరాబాద్,నవంబర్10(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి సైలెంట్‌గా తన రాజకీయాలను కొనసాగిస్తున్నట్లుగా ఉంది. అనూహ్యంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ అయిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌లో రాహుల్‌కు అనుకూలమైన నేతగా ఎదిగారు. బయటకు కనిపించకుండా ముందుగా చాపకింద నీరులా అధికార టిఆర్‌ఎస్ ఎత్తులకు చెక్ పెడుతున్నారు. దీనికితోడు కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు ఎక్కువ. వాటిని సంతృప్తి పర్చడం ఒక ఎత్తయితే అవి ఎదురు తిరగకుండా చూసుకోవడం మరో ఎత్తు. అందుకే కాంగ్రెస అధ్యక్షుడు రాహుల్‌తో గట్టి హావిూ తీసుకునే ఆయన రంగప్రవేశం చేశారని అంటున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీలో కొప్పుల రాజు ఆశిస్సులు బలంగా ఉన్నాయని సమాచారం. ఇదంతా టిఆర్‌ఎస్‌ను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. ఇదే సందర్భంలో అధిష్టానం అండవుందని తెలిస్తే కాంగ్రెస్‌లో ఎన్ని గ్రూపులున్నా తోకముడుస్తాయి. తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఓ రకంగా రేవంత్ బాగా పనిచేశారనే చెప్పాలి. అంతేగాకుండా ఆయా పార్టీల్లో ఉన్న రెడ్డి సామాజికవర్గం ఏకమయ్యేలా స్కెచ్ వేస్తున్నారు. ఇప్పుడంతా వెలమ పెత్తనానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నారు. ఇటీవల రేవంత్ ఓ సందర్బంలో వెలమ అధికారులు ఎక్కడెక్కడ ఎలా పాతుకుపోయారో కూడా వివరించారు. దీంతో రానున్న రోజుల్లో మళ్లీ పాత రెడ్డి కాంగ్రెస్ ఊపిరి పోసుకోనుంది. అందుకే దానికి సంబంధించి సంకేతాలు కూడా వస్తున్నాయి. తెలంగాణ టిడిపితో పాటు, బిజెపి, టిఆర్‌ఎస్‌లలో ఉన్న రెడ్డి సామాజిక వర్గాలను కాంగ్రెస్‌లో చేర్చేందుకు రేవంత్ రెడ్డి సైలెంట్‌గా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారంతా ఆయా పార్టీల్లో ప్రాధాన్యం లేకుండా కొనసాగు తున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన తరుణం ఇదేనని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆయన తెదేపా నుంచి కొందరు కీలక నాయకులు సహా కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ద్వారా కాంగ్రెసులో చేరడానికి మరికొంత మంది సిద్ధంగా ఉన్నారు. ఈలోగా.. ఎప్పటినుంచో రాజకీయ వాసనకే దూరంగా ఉన్న విజయశాంతి లాంటి వాళ్లు కూడా తిరిగి పార్టీలో చురకుగా తయారవుతున్నారు. ఆమె రాహుల్ ను కలిసి..
సామాన్య కార్యకర్తగా పార్టీ పని చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదేక్రమంలో టిడిపి నుంచి భారతీయ జనతా పార్టీలోచేరిన నాగం జనార్దనరెడ్డి లాంటివారు వారుకూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రమే కేసీఆర్‌కు వ్యతిరేకంగా, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ.. చాలా రకాలుగా ఒంటరిపోరాటం సాగిస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో రాజకీయ వ్యూహాలు, సవిూకరణాలు శరవేగంగా మారుతున్నాయనడానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవాలి. మారుతున్న పరిణామాల నేపథ్యంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తన వ్యూహాలను సవరించుకుంటోంది. చంద్రబాబుపై విమర్వలతో మళ్లీ ఆత్మగౌరవ నినాదం ప్రచారం చేస్తోంది. ఇకపోతే పార్టీల్లో నూతన చేరికలతో పాటు జాతీయ స్థాయిలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్న వార్తలతో కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. తెలంగాణలో అధికారం కాయం అన్నరీతిలో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు వల్ల బలపడవచ్చునన్న అంచనాలతో ఉన్న భారతీయ జనతా పార్టీకి మాత్రం తెలంగాణలో చుక్కెదురయ్యింది. తెలుగుదేశం పార్టీ బలహీనపడితే తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చుననుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అంచనాలు తప్పుతున్నాయి. టిడిపి కాంగ్రెస్‌తో జతకట్టడంతో బలమైన కూటమి ప్రత్యర్థిగా ఎదురు నిలిచింది. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన పలువురు శాసనసభ్యులు విలీనం పేరిట టీఆర్‌ఎస్‌లో చేరిపోగా, మిగిలిన నాయకులలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్‌రెడ్డి నిర్ణయంతో కాంగ్రెస్ ద్వారా కెసిఆర్ వ్యతిరేక శక్తులు పునరేకరణ అవుతున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై అయోమయంలో ఉన్న నాయకులకు రేవంత్ చుక్కానిలా కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేలను లాగేసుకుంటే పార్టీ ఫినిష్ అవుతుందనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయకూడదన్న అభిప్రాయంతో ఉన్నారు. అందుకే ఆకర్శణలకు పెద్దపీట వేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేదిగా తయారు కావడంతో ఈ ఎన్నికలు నిస్సందేహంగా ఆసక్తి కలిగిస్తున్నాయి.