స్టాక్‌ మార్కెట్లో మళ్లీ సానుకూలత

లాభాలతో పరుగెత్తిన మార్కెట్‌

ముంబయి,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): దలాల్‌స్ట్రీట్‌ మళ్లీ కళకళలాడింది. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. అయితే ఐటీ, ఔషధ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో ఆరంభంలో సూచీలు కాస్త తడబడినా చివర్లో కొనుగోళ్ల అండతో భారీ లాభాలను దక్కించుకున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 350 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 10,600 మార్క్‌పైన ముగిసింది. ఈ ఉదయం సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. అయితే అమ్మకాల ఒత్తిడితో మార్కెట్‌ ఆరంభమైన కాసేపటికే సూచీలు ఒడుదొడుకుల్లో సాగాయి. గంట వ్యవధిలోనే ఆరంభ లాభాల్లో చాలా వరకు కోల్పోయాయి. అయితే మధ్యాహ్నం తర్వాత ఆర్థిక, ఆటోమొబైల్‌ తదితర రంగాల్లో మదుపర్లు కొనుగోళ్లు జరపడంతో సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. నేటి సెషన్‌లో సెన్సెక్స్‌ 373 పాయింట్లు ఎగబాకి 35,354 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 102 పాయింట్లు లాభపడి 10,629 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.68గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో హీరోమోటార్స్‌, విప్రో, హిందుస్థాన్‌ యునిలివర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడగా.. ఓఎన్జీసీ, సన్‌ఫార్మా, యస్‌ బ్యాంక్‌, వేదాంతా లిమిటెడ్‌, కోల్‌ఇండియా షేర్లు నష్టపోయాయి.