స్త్రీ శక్తి: బావులు తవ్వి కరువును జయించారు
కరువుతో దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. నీళ్లు లేక రైతులు పంటలు పండించలేకపోతున్నారు. పాల ఉత్పత్తిపై బతికేవాళ్లు.. పశువులను అమ్మేసుకుంటున్నారు. రైతు వెన్నెముకను విరిచేసి.. ఇళ్లు గడిచే దిక్కులేక .. ఆత్మహత్యలకు దారితీయిస్తోంది కరువు. దక్షిణాన ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. జలకళతో ఎప్పుడూ పచ్చగా కనపడే.. కేరళాలోనూ ఇదే పరిస్థితి. కరువు పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది పాలక్కాడ్ జిల్లాలోని పూకొట్టావు గ్రామం. అక్కడ కరువు విలయతాండం చేస్తోంది. నీటి చుక్క కోసం పరితపిస్తున్నారు జనం. నీళ్ల కోసం రోజూ మూడు నాలుగు కిలోమీటర్లు నడుస్తునారు. అడుగంటిన భూగర్భ జలాలను ఒడిసి పట్టుకునేందుకు ఆరు నెలల్లో 150 బావులు తవ్వారు. అయితే ఇవేవి మగాళ్లు తవ్వినవి కాదు. కేవలం స్త్రీలు మాత్రమే ఈ పనుల్లో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద.. 300 మంది మహిళలు.. బావులు తవ్వారు. ఏమాత్రం భయం లేకుండా 100 అడుగుల లోతు వరకు వెళుతున్నారు. తాళ్ల సాయంతో దిగుతూ.. ఎక్కుతూ… బావులు తవ్వుతున్నారు. ఈ బావులతో ఒకవైపు నీళ్ల బాధ తీరుతుంటే.. మరోవైపు ఆ గ్రామంలోని మహిళలకు చేతినిండా పనిదొరకుతుంది. బావుల తవ్వకంతో నాలుగు రూపాయిలు సంపాదించుకోగలుగుతున్నారు. పోయిన వేసవిలో తనకున్న రెండు పశువులను అమ్మకున్న ఒక స్త్రీ… ఈ ఏడాది మూడింటిని కొనుక్కున్నది. ఇది పూకొట్టావు గ్రామ పరిస్థితి. పచ్చని కేరళకూ కరువు బాధలు తప్పడం లేదంటూ వాపోతున్నారు జనం.