స్థానిక సమస్యలపై పోరాటాలు నిర్వహించాలి

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
(జనంసాక్షి) జులై 18 : స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. సోమవారం మండలంలోని ముస్త్యాల గ్రామ శాఖ సీపీఐ 12వ మహాసభకు మండల నాయకులు గూడెపు సుదర్శన్ అధ్యక్షతన జరుగగా అందె ఆశోక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. పట్టణాలు పల్లెల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ మురికి కాలువలు, ఇండ్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, అర్హులైన నిరుపేదలకు ఆసరా పింఛన్ ఇవ్వాలన్నారు. బచ్చన్నపేట నుండి దుద్దెడ క్రాస్ వరకు రోడ్డు పూర్తిగా స్వంసమైందని, కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని, చేర్యాల పాత నియోజకవర్గాన్ని 4మండలాలతో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేసి పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ కార్యదర్శిగా కేసిరెడ్డి బాల్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా మనెపల్లి కిష్టయ్య, సిలిమిండ్ల భూపాల్ రెడ్డి, కోశాధికారిగా గుడెపు సుదర్శన్, కార్యవర్గ సభ్యులుగా ఆత్మకూరి హరిక్రిష్ణ, చేర్యాల బాలయ్య, చిగురు రాజయ్య, గుడెపు పెంటయ్య, ఈరి సత్తవ్వ, గూడెపు సంతోష, కొండెపోగు శాంతమ్మ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు, మండల నాయకులు సకినాల బాలరాజు, సిద్దిరాం భద్రయ్య, కనకయ్య, రాజిరెడ్డి, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
Attachments area