స్పెషల్ ఆఫీసర్ ను కుట్రపూరితంగా సాగనంపారు.
– ప్రజాతంత్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబాల మహేందర్.
ఫొటో : విలేకరులతో మాట్లాడుతున్న విద్యార్థి సంఘం నాయకులు.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 15, (జనంసాక్షి )
నెన్నెల మండల కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అమూల్యను కుట్ర పూరితంగా సాగనంపారాని ప్రజాతంత్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబాల మహేందర్ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేజీబీవీలో చాలా సంవత్సరాలనుండి పాతుకు పోయిన సిబ్బంది ఇన్నాళ్లు ఇష్టారాజ్యంగా కొనసాగి నూతన స్పెషల్ ఆఫీసర్ రావడం వారి పప్పులు ఉడకలేదని, కుట్ర పూరితంగా స్పెషల్ ఆఫీసర్ అమూల్యను తప్పించారని అన్నారు. గతంలో ఇంచార్జి స్పెషల్ ఆఫీసర్ గా పద్మజ పేరెంట్స్ మీటింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారని, పలుమార్లు పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని కోరినప్పటికీ ఆమె పేరెంట్స్ సమావేశానికి రారు అని తప్పించుకుంటున్నారన్నారు. పేరెంట్స్ కమిటీ సమావేశం విషయమై గతంలోనూ ఏంఈఓ దృష్టికి తీసుకువెళ్ళమన్నారు. విద్యార్థుల సమస్యలపై గతంలో ఉన్న ఇంచార్జి స్పెషల్ ఆఫీసర్ పద్మజను అడుగగా ప్రభుత్వం నుంచి బడ్జెట్ రావడం లేదని చాలాసార్లు సమాధానం చెప్పారన్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా గ్రూపులు తయారు చేసి విద్యార్థులతో సోషల్ టీచర్, స్పెషల్ ఆఫీసర్ పై తప్పుడు ఆరోపణలు చేయించి వారిని తప్పించారన్నారు. గతంలో కన్నెపల్లి కేజీబీవీలో జరిగిన సంఘటనలు ఆసరా చేసుకొని అలాంటి ఆరోపణలు చేశారన్నారు. ఇదే కేజీబీవీలో ఇంచార్జి గా విధులు నిర్వహించిన పద్మజ ఆమె హోదాను జీర్ణించుకోలేక ఇలాంటి కుట్రలు పన్ని బలి చేశారని అన్నారు. ఈమెకు తోడుగా పీఈటీ టీచర్ విజయ విద్యార్థులను రెచ్చగొట్టి భోజనంలో పురుగులు వచ్చాయని చెప్పించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. మాజీ ఇంచార్జి పద్మజ, పై తగు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తాము చేసిన ఆరోపణలకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట ఆసంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్ ఉన్నారు.