స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

న్యూఢిల్లీ, మే8(ఆర్‌ఎన్‌ఎ) : అంతర్జాతీయ సంకేతాలతో సోమవారం భారీ లాభాలను ఆర్జించిన స్టాక్‌మార్కెట్లు మంగళవారం మాత్రం ఫ్లాట్‌గా ముగిశాయి. మదుపర్ల అప్రమత్తతతో ఆద్యంతం ఊగిసలాడిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ 8 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ స్వల్పంగా 2 పాయింట్లు ఆర్జించింది. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు, కొనుగోళ్ల అండతో మంగళవారం ఉదయం సూచీలు ఉత్సాహంగానే ప్రారంభమయ్యాయి. ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైనే లాభపడగా.. నిఫ్టీ కూడా 10,750 మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే ఇరాన్‌ డీల్‌పై మరికొద్ది గంటల్లో నిర్ణయం వెల్లడిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. దీంతో ఈ నిర్ణయంపై దృష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటించారు. ఈ నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. రోజంతా ఇదే ఊగిసలాటలో కొనసాగిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. మంగళవారం మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 8 పాయింట్ల లాభంతో 35,216 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల లాభపడి 10,718 వద్ద స్థిరపడ్డాయి.
సీఐసీఐ షేర్ల జోరు..
మంగళవారం మార్కెట్లో దేశీయ అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ షేర్లు రాణించాయి. ఐసీఐసీఐ మార్చి తైమ్రాసికం ఫలితాలను నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తైమ్రాసికంలో బ్యాంకు నికరలాభంతో 45శాతం నష్టాన్ని చవిచూసింది. అయినప్పటికీ నేటి మార్కెట్లో ఐసీఐసీఐ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఒకానొక దశలో బ్యాంకు షేరు విలువ 9శాతానికి పైగా పెరిగింది. మార్కెట్‌ ముగిసే సమయానికి ఎఎస్‌ఈలో బ్యాంకు షేరు 6.45శాతం లాభపడి రూ. 308.50గా ఉంది. ఇక బీఎస్‌ఈలోనూ 6.86శాతం లాభంతో రూ. 309.25గా ఉంది.ఈన్‌ఎస్‌ఈలో హిందుస్థాన్‌ పెట్రోలియం, ఐషర్‌ మోటార్స్‌, భారత్‌ పెట్రోలియం, ఎస్‌బీఐ షేర్లు లాభపడగా.. మహింద్రా అండ్‌ మహింద్రా, ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫోసిస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి.