స్వాతంత్ర్య ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర
– ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు అందె అశోక్
ఘనంగా ఏఐఎస్ఎఫ్ 87వ ఆవిర్భావ వేడుకలు..
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 12 : భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందని ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు అందె అశోక్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ 87వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా అంగడి బజారులో సంఘం జెండాను ఆయన ఎగరవేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం రాక పూర్వమే దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, ఆజాద్ ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబృద్దీన్ బాసు, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల నాయకత్వాన 1936 ఆగస్టు 12న ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బానిసచేర నుంచి మాతృభూమి విముక్తికై సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని మా ప్రాణాలను తీసినా స్వాతంత్ర్యోద్యమం సాధించే వరకు ఉద్యమిస్తాం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని, భరతమాత బానిస సంకెళ్ల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవకిషోరుల బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశములోనే ఏకైక విద్యార్ధి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్య్రనంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 87 సంవత్సరాలుగా విద్యార్ధుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటివరకు గల్లి నుండి డిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే ప్రాణంగా విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చదువుతూ పోరాడు-చదువుకై పోరాడు అనే నినాదంతో తెలంగాణ రైతాంగ పోరాటంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరోచిత పోరాటం, 18 సంవత్సరములకు ఓటుహక్కు ఉద్యమం, మలిదశ తెలంగాణ పోరాటంలో, సంక్షేమ, గురుకుల హాస్టళ్ల సమస్యలపై, విద్య వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న పాలకులపై అలుపెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో విజయాలు సాధించిన ఘనత ఏఐఎస్ఎఫ్ కే దక్కుతుందని, ఇంతటి పోరాట త్యాగాల చరిత్ర కలిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా విద్యార్థుల పక్షాన ఉద్యమాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు, మండల నాయకులు భోగి మనోహర్, ముచ్చాల సుధీర్, బొక్కల రాకేష్, కొమ్మరాజుల తిరుపతి, నరేష్, కుమార్, రోహిత్,రాహుల్, అజయ్, శివ,రాజేందర్, శంకర్,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.