హక్కులు డిమాండ్‌ చేస్తే..  దాడులు చేస్తున్నారు


– ప్రకృతి విపత్తులను పట్టుదలతో అధిగమిస్తున్నాం
– రాజకీయ కుట్రలే పెద్ద తలనొప్పిగా మారాయి
– సమస్యల పరిష్కారంలో పోటీ పడాలి
– కక్షసాధింపు వైఖరి సరికాదు
– ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దం
– పారిశుద్ద్య పనులు వేగవంతం చేసి.. అంటు వ్యాధులు ప్రబలకుండా చూడండి
– శ్రీకాకుళంలో మంగళవారంకు పరిస్థితులు మెరుగుపడాలి
– అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : రాష్ట్రానికి రావాల్సిన హక్కులను డిమాండ్‌ చేస్తుంటే.. ఐటీ దాడులు చేసే పరిస్థితి నెలకొందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి సోమవారం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ప్రకృతి వల్ల తలెత్తే సమస్యలు పరిష్కరించగలుగుతున్నామని, కానీ రాజకీయ కుట్రలు అంతకంటే తలనొప్పిగా మారాయని బాబు ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రం ఏర్పడగానే విభజన సమస్యలు చుట్టుముట్టాయని అన్నారు. అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ ఇబ్బంది పెడితే.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మరో రకంగా వివక్ష చూపిస్తోందన్నారు. దీనికి అదనంగా రాష్ట్రంలోని మరో పార్టీ సహాయ నిరాకరణతో అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు సమస్యగా మారాయని.. వాటిని పట్టుదల, కసితో అధిగమిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మన హక్కులు డిమాండ్‌ చేస్తే దాడులు చేసే పరిస్థితి నెలకొందని బాబు అన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని అభిప్రాయపడ్డారు. ఐటీ దాడులు చేయడం ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారంలో పోటీ పడాలే తప్ప.. కక్ష సాధింపు వైఖరి సరికాదని హితవు పలికారు. న్యాయం, ధర్మం, మంచి పనులే శాశ్వతంగా ఉంటాయన్నారు. తుపాను బాధిత ప్రజలకు అండగా ఉండాలని, వంశధార ఎడమ కాలువ గండ్లు పూడ్చే పనులు వెంటనే పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. చెరువుల కట్టలు పటిష్టం చేసే పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. నష్టపోయిన రైతులు పంట బీమా అడుగుతున్నారని, ఆ కంపెనీలతో తక్షణమే చర్చించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంట బీమా ప్రయోజనం బాధిత రైతాంగానికి అందించాలని, ఇప్పటికే 35వేల హెక్టార్లలో ఎన్యూమరేషన్‌ పూర్తిచేశారన్నారు. మిగిలిన లక్ష హెక్టార్లలో పంటనష్టం అంచనా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు సిబ్బందిని, అధికారులను రప్పించుకోవాలని, పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని సూచించారు. మంగళవారం తాను శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికల్లా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశంచేశారు. సాంకేతికత అభివృద్ధితోనే విపత్తులను అధిగమిస్తున్నామని చెప్పుకొచ్చారు. హుద్‌ హుద్‌, టిట్లి తుపాన్లలో ప్రాణ నష్టం తగ్గించగలిగామన్నారు. టిట్లి తుపాన్‌ ఎక్కడ, ఎప్పుడు తీరం దాటుతుందో ఖచ్చితంగా అంచనా వేశామని సీఎం చెప్పారు. ఇప్పుడు అధికారులు అవిశ్రాంతంగా పనిచేయాలని..బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారు. చెరువు కట్టల పటిష్టం పనులు
వెంటనే పూర్తిచేయాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులు, జిల్లాల కలెక్టర్లు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తాజావార్తలు