హమ్మయ్య ! పెట్రో భారం లేదట
పెట్రోల్ ధరల పెంపు యోచన లేదు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7 (జనంసాక్షి) :పెట్రో ధరల పెరుగుదలపై ఉత్కంఠకు తెరపడింది.. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ఊహాగానాలకు తెరదించారు. చమురు సంస్థల ఎత్తుగడలను తిప్పికొట్టారు. పెట్రో ధరలు పెరగనున్నాయనే వార్తలను తోసిపుచ్చారు. ఇప్పట్లో ధరలు పెంచే యోచనేది ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్‌లపై సబ్సిడీ తగ్గించే అంశంపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన ఇండియన్ ఆయిల్ కార్యక్రమంలో మంత్రి జైపాల్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. పెట్రోల్ ధరల పెంపు వారం రోజులుగా చెలరేగుతున్న ఊహాగానాలకు తెరదించారు. మంత్రి ప్రకటనతో వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. ధరల పెంపు ప్రతిపాదిన ఫైలు రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) ముందుకు చేరిందని, ఇవాళో, రేపో ఆమోదించనున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తమని జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘పెట్రో ధరల పెంపునకు నంబంధించిన వాస్తవాలు, ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ మంత్రిగా రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టడం నా బాధ్యత. ఈ అంశంపై సీసీపీఏ ఎప్పుడు చర్చిస్తుందో నాకు తెలియదు’ అని అన్నారు. అయితే, చమురు కంపెనీల నష్టాలను తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొన్ని కఠినమైన, బాధాకరమైన నిర్ణయాలు తీసుకోకతప్పదని అన్నారు. పెట్రోల్ ధరల పెంపుపై క్యాబినెట్ కమిటీదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
మంత్రి ప్రకటనతో పెట్రోలియం కంపెనీల షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. భారత్ పెట్రోలియం 3 శాతం పడిపోగా, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ షేర్లు కూడా దిగజారాయి. హెచ్‌పీసీఎల్ 2.75 శాతం, ఐఓసీ 1.9 శాతం పడిపోయాయి.
చమురు కంపెనీలు పెట్రోలు ధరలను పెంచనున్నట్లు గురువారం విస్తృతంగా వార్తలు వెల్లువడ్డాయి. పార్లమెంట్ సమావేశాలు శుక్రవారంతో ముగియనుండడంతో.. శనివారం నుంచే ధరల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, లీటర్‌పై రూ.5 మేర పెంచే అవకాశం ఉందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. వచ్చే వారం డీజిల్, కిరోసిన్ ధరలు కూడా పెరగనున్నట్లు వార్తలు వచ్చాయి. వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన సోనియా సెప్టెంబర్ 10న తిరిగివచ్చిన అనంతరం.. ఆమెతో చర్చించి డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్ ధరలపై నిర్ణయం తీసుకోనున్నారని ఊహాగానాలు చెలరేగాయి. ఈ మేరకు ఇప్పటికే క్యాబినెట్ నోట్ సర్క్యులేట్ అయిందని, యూపీఏ చైర్‌పర్సన్ అనుమతి రాగానే పెంఇన ధరలు అమల్లోకి తెస్తారని తెలిసింది. ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో.. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రోజూ రూ.550 కోట్ల మేర నష్టపోతున్నాయి. లీటర్ డీజిల్‌పై రూ.17, కిరోసిన్‌పై రూ.32.7, వంటగ్యాస్ సిలెండర్‌పై రూ.347 మేర నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.