హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాల అరెస్టు

న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) :
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌతాలా చిక్కుల్లో పడ్డారు. ఉపాధ్యాయుల అక్రమ నియామకాల కేసులో ఆయనను ఢిల్లీ కోర్టు బుధవారం దోషిగా నిర్దారించింది. ఈ కేసులో చౌతాలతో పాటు ఆయన తనయుడు, ఎమ్మెల్యే అభయ్‌ చౌతాలాతో పాటు 53 మందిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. దీంతో మాజీ సీఎం చౌతాలాతో పాటు మిగతా నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో శిక్షను కోర్టు ఈ నెల 22న ఖరారు చేయనుంది. రాష్ట్రంలో జరిగిన 3 వేల మంది జూనియర్‌ బేసిక్‌ ట్రెయిన్డ్‌ (జేబీటీ) ఉపాధ్యాయులను అక్రమ నియామించినట్లు వచ్చిన అభియోగాలను కోర్టు సమర్థించింది. మాజీ సీఎం చౌతాలా, ఆయన కుమారుడు సహా 53 మందిపై ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన అభియోగాలను సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి వినోద్‌కుమార్‌ సమర్థించారు. ఈ కేసులో చౌతాలతో పాటు అప్పటి ప్రాథమిక విద్యా డైరెక్టర్‌ సంజీవ్‌కుమార్‌, ప్రత్యేకాధికారి విద్యాధర్‌, నాటి సీఎం రాజకీయ సలహాదారు షెర్‌సింగ్‌ సహా పలువురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషుల్లో 16 మంది మహిళలు కూడా ఉన్నారు. శిక్ష ఖరారుపై ఈ నెల 17, 19, 21 తేదీల్లో కోర్టు వాదనలు విననుంది. 1999-2000 సంవత్సరంలో రాష్ట్రంలో చేపట్టిన 3,206 జూనియర్‌ బేసిక్‌ శిక్షణ (జేబీటీ) ఉపాధ్యాయుల నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. దర్యాప్తు పూర్తి చేసి 2008 జూన్‌లో చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 62 మంది నిందితులుగా చేర్చగా, విచారణ సమయంలో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతులపై ఉన్న అభియోగాలను తొలగించారు.