హిమాచల్‌లో స్వల్ప భూకంపం

సిమ్లా,మే3(జ‌నంసాక్షి):  శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న స్వల్ప భూకంపం హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికించింది. రిక్టార్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మండికి ఈశాన్యంలో 10 కిలోవిూటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్టు సిమ్లా వాతావరణ కేంద్ర డైరెక్టర్‌ మన్మోహన్‌ సింఘ్‌ తెలిపారు. తెల్లవారుజామున 4.32 సమయంలో మండి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. మండి పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిపాటి ప్రకంపనలు వచ్చాయన్నారు. మండి సహా హిమాచల్‌ ప్రదేశ్‌లోని అధికభాగం భూకంప తీవ్రతగల జోన్‌లో ఉంది. దీని కారణంగానే ఈ ప్రాంతంలో తరచూ స్వల్ప ప్రకంపనలు సంభవిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.