హీనా రబ్బాని , ఎస్‌ఎం కృష్ణల చర్చలు సఫలం

భారత్‌ పాక్‌ సంబంధాల్లో ముందడుగు
జాలర్ల విడుదల.. వీసా నిబంధనల సడలింపు
ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 8 :
ఉగ్రవాదం సహా పలు అంశాలపై భారత్‌-పాక్‌ల మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదమే ప్రధాన ఎజెండాగా ఇరుదేశాల విదేశాంగ శాఖల మంత్రులు ఎస్‌ఎం కృష్ణ, హీనా రబ్బానీ ఖర్‌లు శనివారం ఇస్లామా బాద్‌లో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శలు రంజాన్‌ మాథాయ్‌, జలిల్‌ అబ్బాస్‌ జిలానీలు కూడా పాల్గొన్నారు. ద్వైపాక్షిక అంశా లతో పాటు రెండు దేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబం ధాలకు ఊతమిచ్చేలా నూతన సరళీకృత వీసాల జారీపై ఒప్పందం కుదుర్చుకునే అంశంపైనా చర్చించారు. వీసాల సరళీకరణ ఒప్పందంపై ఇరువురు సంతకం చేసే అవకాశం ఉంది. అలాగే, ఉభయదేశాల మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ, ఖైదీల విడుదల, సరిహద్దు సమస్య తదితర అంశాలపై చర్చ జరిగింది. అంతకుముందు శుక్రవారం ఇస్లామాబాద్‌కు చేరుకున్న కృష్ణ పాక్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని పర్వేజ్‌ అష్రాఫ్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. భారత్‌-పాక్‌ సంబంధాలను మెరుగు పరచడంపై చర్చించారు. పాకిస్తాన్‌లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారత ఖైదీ సరబ్‌జిత్‌ సింగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించే అంశాన్ని పరిశీలిస్తానని జర్దారీ హావిూ ఇచ్చారు. మర్యాదపూర్వకంగా తనను కలిసేందుకు వచ్చిన కృష్ణకు జర్దారీ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. సరబ్‌ కేసు వివరాలు రాసుకోవాలని ఆదేశించారు. మరోవైపు, ఈ ఏడాది చివర్లోగా భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పాక్‌ పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని పర్వేజ్‌ తెలిపారు. ఆయన రాక కోసం తామంతా ఎదురుచూస్తున్నామన్నారు. ఉగ్రవాదమే ప్రధాన అజెండాగా చర్చలు జరుగుతున్నాయని భారత అధికారులు తెలిపారు. ముంబై దాడుల విచారణ మందగమనంగా సాగుతుండడంపై భారత్‌ ఆందోళనగా ఉందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో కృష్ణ పాక్‌లో పర్యటించడం ఇది రెండోసారి.