హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కిస్తే క్రిమినల్‌ కేసు

గౌహతి: రోగులకు హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కిస్తే వారిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ ఆదేశించారు. స్థానిక దారంగ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు రోగులకు హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించిన సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఈ సందర్బంగా శనివారం ఆసుపత్రిని సందర్శించిన గొగోయ్‌ మాట్లాడుతూ..ఇక్కడి ప్రత్యేక వైద్య బృందం ఘటనపై దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాల్సిందిగా ఉన్నతాధికారులను గొగోయ్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ రక్తనిధి కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఆరోగ్యశాఖలపై  తప్పిదాన్ని మోపలేమని ఆయన స్పష్టం  చేశారు. ఏదో కొంత మంది అధికారుల వల్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున పరిహారం చెల్లిస్తామన్నారు. అధికారికంగా నలుగురికి హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించారని ప్రకటించినా.. అనధికారికంగా మాత్రం పది మంది బాధితులున్నట్లు సమాచారం.