హైడ్రాకు పెరుగుతున్న మద్దతు
బిఆర్‌ఎస్ విమర్శలపై మండిపడ్డ కోదండరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణలు కూల్చేయాలన్న నేతలు
హైదరాబాద్,ఆగస్ట్26 (జనం సాక్షి): హైడ్రాకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అటు పొలిటికల్‌గా.. ఇటు సామాన్యుల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తోంది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రాకు కావల్సినంత మద్దతును కూడగట్టింది. అన్ని వర్గాల ప్రజలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాపై సొంత పార్టీలో ఇబ్బందులు వస్తాయని తొలుత సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కానీ ఎమ్మెల్యేలంతా రేవంత్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. తెలంగాణ సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాలు రక్షిస్తోందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ… దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కమిటీ కూడా గతంలో వేసిందే అని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర విభజన కాకముంటే కాంగ్రెస్ సర్కార్ 2030 వరకు హెచ్‌ఎమ్‌డీఏ ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించిందన్నారు.తాగునీటి అవసరాల కోసం కూడా మాస్టర్ ప్లాన్‌లో లేక్స్ ప్రొటెక్షన్ చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. 2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ అక్రమ నిర్మాణాలకుమద్దతు చేసిందని ఆరోపించారు. హైడ్రా ఏర్పాటు చేసి ప్రజల మన్నన్నలు పొందుతున్న సీఎం రేవంత్‌పై ఎంఐఎం, బీఆర్‌ఎస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలు పూర్తిగా మద్దతు ఇస్తున్నారన్నారు. ప్రజలు కూడా ర్యాలీ చేస్తున్నారన్నారు. హుస్సేన్ సాగర్ కాపాడుకోవాలని విజయభాస్కర్ రెడ్డి కాలంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, నెక్లస్ రోడ్ ఏర్పాటైందన్నారు. తొమ్మిదన్నరేళ్ల కాలంలో చెరువులను ఎందుకు కాపాడలేదని హరీష్ రావును కోందండరెడ్డి ప్రశ్నించారు. కేవలం ప్రబుత్వంపై విమర్శలు చేయడమే బిఆర్‌ఎస్ లక్ష్యంగా ఉందన్నారు. ప్రకృతిని కాపాడడానికి చెరువులు కాపాడాలన్నారు. హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం కృష్ణ, గోదావరి నీటిని తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కారే రానున్న 30 ఏళ్ల వరకు తాగునీటి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని తెలిపారు. ధర్మం కోసం భగవత్ గీతను కూడా స్ఫూర్తిగా తీసుకున్నా అని సీఎం రేవంత్ నిన్న చెప్పారన్నారు. హెచ్‌ఎండీలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కోదండరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తారించాలని రేవంత్‌కి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. హైడ్రాపై అభినందనలు తెలుపుతూ రేవంత్‌కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్‌లు లేఖ రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ కోసం సీఏం రేవంత్‌కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లేఖ రాశారు. వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఎఫ్‌టీఎల్ పరిధిలో గెస్ట్ హౌజ్ కట్టాడని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు. హైడ్రాను తమ నియోజకవర్గంలో కూడా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రిక్వెస్ట్ చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో కూడా ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని వేముల వీరేశం లేఖ రాశారు. ఆలేరు నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన భూములు, అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎంకి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లేఖ రాశారు. తమ నియోజకవర్గంలో హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకు రావాలని మానుకొండూర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే కాలే యాదయ్య, తదితరులు రేవంత్‌కి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జ్ఞాన సుందర్ గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హైట్ కొలవగలరేమో కానీ ఆయన ఆత్మవిశ్వాసాన్ని కొలవలేరని కొనియాడారు. పేదవాడిని కొట్టడం తప్ప, పెద్ద వాళ్ళకి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎవరికీ భయపడకుండా ముందుకి పోతోందన్నారు. హైడ్రాకి ప్రజల మద్దతు ఉందన్నారు. తెలంగాణ అంతటా హైడ్రా లాంటి వ్యవస్థను విస్తరించాలని కోరారు. రేవంత్ ఆలోచనకి ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవుతోందన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు బీఆర్‌ఎస్ నాయకులు చెప్పినట్టు విన్నారని.. అందుకే ఫేక్ పట్టాలు పొందగలిగారని జ్ఞాన సుందర్ పేర్కొన్నారు. అయితే నగరంలో హైడ్రా మాత్రం నాన్ స్టాప్‌గా కూల్చివేతలు నిర్వహిస్తోంది. శేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. రాయదుర్గం సర్వేనెంబర్ 72లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీగా పోలీసుల మోహరించారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు.