హైడ్రా ఏర్పాటును స్వాగతించాల్సిందే

జన్వాడ ఫామ్‌హౌజ్‌ ఇప్పుడు కాదని కెటిఆర్‌ ఎలా అంటారు
బతుకమ్మ కుంట ఆక్రమణలపైనా చర్యలు తీసుకోవాలి
మాజీ ఎంపి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌ డిమాండ్‌
హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనం సాక్షి) : జన్వాడ ఫామ్‌ హౌస్‌పై మాజీ ఎంపీ వి. హనుమంత రావు హాట్‌ కామెంట్స్‌ చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసి సీఎం రేవంత్‌ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రామంతపూర్‌ చెరువు, బతుకమ్మ కుంట చెరువు కూడా ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలు చేశారు. శనివారం గాంధీభవన్‌లో హనుమంత రావు విూడియాతో మాట్లాడుతూ… వాటిపై కూడా చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాలను కూలగొట్టాలని అన్నారు. ఆ స్థలంలో పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టివ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గతంలో జన్వాడ ఫామ్‌ హౌస్‌ తనదే అని మాజీ మంత్రి కేటీఆర్‌ చెప్పారని అన్నారు. ఇప్పుడు తన ఫ్రెండ్‌ దగ్గర లీజుకు తీసుకున్న అంటున్నారని చెప్పారు.ఏదైనా సరే అక్రమంగా నిర్మాణం చేపడితే కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణల కూల్చివేతకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతామని హనుమంత రావు వెల్లడిరచారు. ఈ నెల 27న గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు కోదండ రాం ,అవిూర్‌ అలీ ఖాన్‌లకు రవీంద్ర భారతిలో సన్మానం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణలో సంస్కారం లేని కుటుంబం మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబమని మహిళ ఫైనాన్స్‌ చైర్మన్‌ శోభారాణి ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్‌ సంస్కార హీనుడని విమర్శలు చేశారు. సంస్కారం కావాలంటే గాంధీ భవన్‌ కొస్తే తాము నేర్పిస్తామని చెప్పారు.పదేళ్లలో ధనిక రాష్టాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్‌దని చెప్పారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఓర్చు కోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడారని అన్నారు. దాని పర్యవసానమే ఈరోజు మహిళా కమిషన్‌ ముందు కేటీఆర్‌ హాజరయ్యారని అన్నారు. మహిళలకు గౌవరవం దక్కాలంటే అది కాంగ్రెస్‌లోనే దక్కుతుందని చెప్పారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చే పార్టీ కాంగ్రెస్‌ అని తెలిపారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న వదులుకున్న గొప్ప నాయకుడు రాహుల్‌ గాంధీ అని శోభారాణి కొనియాడారు.