హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు
చెరువు శిఖంలో కట్టిన ఎన్ కన్వెన్ష్ కూల్చివేత
అది పట్టాభూమి అంటూ నటుడు నాగార్జున వాదన
కోర్టుకు వెళతామని ప్రకటన…ఆక్రమదారుడిని కాదని వెల్లడి
హైదరాబాద్,ఆగస్ట్24 (జనం సాక్షి) : హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను
కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇది అక్రమ కట్టడమని.. చెరువు స్థలంలో నిర్మించారంటూ ఫిర్యాదులు రావడంతో.. తెల్లవారుజామున.. అక్కడకి చేరుకుని… ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. నామరూపాలు లేకుండా… నిర్మాణాలను నేలమట్టం చేశారు. నోటీసులను గోడకు అంటించి.. వెంటనే కూల్చివేతలు ప్రారంభించారు. నిర్మాహకులకు కూల్చివేతలను అడ్డుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఉంటే.. కోర్టుకు వెళ్లే స్టే తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ.. హైడ్రా అధికారులు ముందస్తు సమాచారం లేకుండా… ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్..హైదరాబాద్ మాదాపూర్ సవిూపంలోని తుమ్మడికుంట ప్రాంతంలో ఉంది. ఇది టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందినది. 2010లో ఎన్.కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. ఈ ఎన్.కన్వెన్షన్ తుమ్మిడి చెరువును ఆనుకునే ఉంటుంది. తుమ్మిడి చెరువు స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. చెరువుకు సంబంధించిన మూడు ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించారు. ఇందులో రెండు ఎకరాలు బఫర్ జోన్ ఉండగా… మరో 1.12 ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవల్ చెరువు శిఖం కిందకు వస్తుంది. దీంతో పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తోణ చర్యలు తీసుకున్న హైడ్రా వెంటనే కూల్చివేతలకు ఆదేశం ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సినీ హీరో నాగార్జున స్పందించారు. హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. అధికారులు చట్టవిరుద్ధంగా చేసిన చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టు స్టే ఇచ్చిందని తెలియజేశారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని, తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా కూల్చివేశారని మండిపడ్డారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుడినని, కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే తానే కూల్చివేతను నిర్వహించేవాడినని, తాజా పరిణామాలతో ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందన్నారు. దీంతో తాము అక్రమాలకు పాల్పడ్డామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నాగార్జున తన బాధను వ్యక్తం చేశారు. మాది పట్టాభూమి అని, ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని, ప్రైవేటు స్థలంలోనే భవనం నిర్మించామని చెప్పారు. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన ఘటనపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. హైడ్రా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ విూడియా వేదికగా పోస్టు పెట్టారు. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేసినట్లు వెల్లడిరచారు. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని నాగార్జున పేర్కొన్నారు.