హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం
మరోమారు లోతట్టు ప్రాంతాలు జలమయం
జంట జలాశయాలకు పోటెత్తిన వరద
హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల
నగరంలో పలు కాలనీలు మళ్లీ జలమయం
శివగంగ థియేటర్ గోడ కూలి వాహనాలు ధ్వంసం
హైదరాబాద్,అక్టోబర్9 (జనంసాక్షి): హైదరాబాద్‌ను రాత్రి భారీ వర్షం వణికించింది. అనేక కాలనీలు మళ్ళీ నీటమునిగాయి. జంటజలాశయాలకు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. యధావిధిగానే మళ్లీ సరూర్ నరగ్ చెరువు నుంచి వరద పోటెత్తి కోదండరామ్ నగర్ సహా అనేక కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. నగరంలోని చంపాపేట్ రెడ్డి కాలనీ సరూర్ నగర్, కోదండరాం నగర్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని కొన్ని కాలనీల్లో మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షానికి జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఇకపోతే సరూర్ నగర్ శివగంగ థియేటర్లో దారుణం చోటు చేసుకుంది. రాత్రి సినిమాకు వచ్చి.. పార్కింగ్‌లో పెట్టిన వాహనాలపై గోడ కూలిపోయింది. దాదాపు వందకు పైగా ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. వాహనాల యజమానులు ఫస్ట్ షో సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం ఉదయం థియేటర్‌ను పరిశీలించారు. జరిగిన నష్టంపై థియేటర్ యాజమాన్యాన్ని ఆరా తీశారు. జేసీబీతో గోడను తొలగించి వాహనాలను బయటకు తీశారు. కాగా.. థియేటర్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో శివ గంగా థియేటర్ పూర్తిగా నీటమునిగింది. నగరంలో నిన్న రాత్రి 7 నుంచి 9గంటల వరకు వరణుడు సృష్టించిన బీభత్సానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల రహదారులు చెరువులను తలపిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. శనివారం ఉదయానికి చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గుంతపల్లి నుంచి మజీద్ పుర్‌కి వెళ్లే దారిలోని వాగులో ఆర్టీసీ బస్సు ఆగి పోయింది. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్` బెంగళూరు రహదారిపై వరద నీరు భారీగా నిలిచింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్ డౌన్ అయి వరదనీటిలో చిక్కుకుంది. ఫలితంగా ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. రహదారికి ఇరువైపులా 3 కి.విూ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరాంఘర్` శంషాబాద్ రహదారిపై కూడా వరద నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అత్యవసర పనులు తప్ప ఎవ్వరూ బయటకు వెళ్లొద్దన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌కు 040`21111111కు సంప్రదించాలని సూచించారు. ఇటీవలి కాలంలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల గులాబ్ తుపాను తరువాత
కూడా ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో.. ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ పరిస్థితులను బట్టి పౌరులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. నగరంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.