సాధారణ ఎన్నికలను తలపిస్తున్న సింగరేణి గుర్తింపు ఎలక్షన్‌

– ఏరులై పారుతున్న మద్యం.. కట్టలు తెంచుకున్న కరెన్సీ

– చీకటి సూర్యుల ఔన్నత్యానికి బీటలు

– ఓటుకు… నోటు, విందుతో ప్రలోభం

– అటకెక్కిన ట్రేడ్‌ యూనియనిజం

– నోట్లను వెదజల్లడానికి రంగం సిద్ధం…?

– ప్రేక్షక పాత్రలో యాజమాన్యం

దయానంద్‌గాంధీ (జనంసాక్షి ప్రతినిధి )

130 యేళ్ల సుదీర్ఘ యాత్ర కలిగిన సింగరేణి చరిత్రకు విఘాతం ఏర్పడింది. పారిశ్రామిక ప్రగతికి ప్రాణం పోస్తున్న బొగ్గు గని కార్మికుల పోరాట ఔన్నత్యానికి మాయని మచ్చ ఏర్పడింది. కార్మిక లోకానికి తలమానికంగా వున్న సింగరేణి చీకటి సూర్యుల కీర్తికి తలవంపు కలుగుతోంది. కార్మికుల పవిత్ర ఓటుకు అపవిత్రత చోటు చేసుకుంది. విప్లవోద్యమాలకు పురిటిగడ్డగా వున్న కార్మిక క్షేత్రంలో జరుగుతున్న ఎన్నికల తీరు తారుమారవుతోంది. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీమ్‌తో అలంకరణతో అందంగా కనిపించే కొన్ని వర్గాలు… బొగ్గు మసితో తమ ముఖాలను అలంకరించుకుని భూమి అడుగుపొరల్లో విధులను నిర్వహించే ఈ కార్మిక వర్గ బతుకులను మరో రకంగా అవహేలన చేయడానికి బొగ్గు గనులు విస్తరించి వున్న ప్రాంతాల్లో ప్రత్యక్షమయ్యారు… తిష్టివేశారు. ప్రజా స్వామ్యవాదానికి కంటతడిపెట్టించే తీరులో సింగరేణిలో గుర్తింపు సంఘ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. తెలంగాణవాదంతో గద్దెనెక్కిన పాలకపక్షం ఈ అనారోగ్య స్థితికి ఆజ్యం పోస్తున్నది. అసలు విషయాల్లోకి వెళితే…

గోదావరిఖని సెప్టెంబర్‌ 28 (జనంసాక్షి):

స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో విస్తరించి వున్న సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం నాలుగేళ్లకు ఒకసారి గుర్తింపు సంఘ ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఏస్‌) గుర్తింపు సంఘంగా ఉండగా, ఈ అధికార సంఘం కాలపరిమితి అయిపోవడంతో యేడాది ఆలస్యంగా 6వసారి గుర్తింపు సంఘానికి అక్టోబర్‌ 5న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో 53,465 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, సింగరేణిలోని 11 రీజియన్లలో 93 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 18 కార్మిక సంఘాలు పోటీ కోసం నామినేషన్లు వేశారు. అయితే ఎఐటియుసికి మద్దతుగా ఐఎన్‌టియుసి, టీఎన్‌టీయుసీ కలయికగా ఈ మూడు కార్మిక సంఘాలు సమిష్టిగా సింగరేణిలో గుర్తింపు సంఘ ఆధిపత్యం కోసం పోటీపడుతున్నాయి. ఈ పొత్తు సంఘాలతో పాటు హెచ్‌ఎంఎస్‌, సిఐటియు, ఎఐఎఫ్‌టియు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. మిగిలిన సంఘాల్లో కొన్ని … అధికార పార్టీకి చెందిన టీబీజీకేఏస్‌కు మద్దతునిస్తున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం సింగరేణి యాజమాన్యం సుమారు రూ.60లక్షల ఖర్చుతో కేంద్ర కార్మిక శాఖ గుర్తింపు సంఘానికి ఎన్నికలు నిర్వహిస్తుంది. సింగరేణిలోని 11 ఏరియాల్లో విస్తరించి వున్న 34 భూగర్బ గనులు, 17 ఉపరితల గనుల్లో పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులు అక్టోబర్‌ 5న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి… విప్లవ సంఘాలకు, విప్లవోద్యమాలకు, వివ్లవకారులకు పుట్టినిల్లుగా ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లోని అణువణువు పోరాట ప్రతిమను చాటుతుంది. ఈ కార్మికుల గుండె చప్పుడు మారుమూల ప్రాంతాలను సైతం పోరాట బాటను పట్టిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ కాంక్షకు ఊపిరిపోసిన ఘనత సింగరేణి కార్మికులకు దక్కింది . సకల జనుల సమ్మెతో తమ అక్రందనను, ఆవేదనను, ఆకాంక్షను వినిపించిన ఈ సింగరేణి బొగ్గు గని కార్మికులు చేపట్టిన సమ్మె బాటతోనే పాలకవర్గం దిగొచ్చింది. ఈ కార్మికులు బిగించిన పిడికిలితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిందనే ప్రఖ్యాతి ఉంది. ఈ పోరాట పటిమ సింగరేణి బొగ్గు గనులకు కొత్తకాకపోగా, అనేక దశల్లో… స్థాయిల్లో విప్లవోద్యమాలు ఆజ్యం పోసుకున్నాయి. చరిత్రకెక్కాయి. శేశగిరిరావు, రమాకాంత్‌, కట్ల మల్లేశ్‌, జంజిపెల్లి శ్రీధర్‌… ఇలా ఎందరో విప్లవోద్యమ కార్మిక క్షేత్ర సృష్టికర్తలు ఈ బొగ్గు గని ప్రాంతాల్లో విరాజిల్లారు. ఇలాంటి ఆమోదయోగ్యమైన,చారిత్రత్మకమైన ప్రఖ్యాతిని కలిగి వున్న బొగ్గుని కార్మికులు ఎవరి ఒత్తిడికి, మాటలకు, ప్రలోభాలకు లొంగరనే ఖ్యాతి ఉంది. పాలకవర్గాల్లో వణుకుపుట్టిస్తారని, పోరాట స్ఫూర్తికి నిలువెత్తు సాక్షంగా ఉంటారని, సింగరేణి మెప్పుకు ఆటంకం ఏర్పడింది. ఈసారి జరుగుతున్న గుర్తింపు సంఘ ఎన్నికల ప్రచార క్రమానికి మాయనిమచ్చ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి జరుగుతున్న గుర్తింపు సంఘ ఎన్నికల్లో పాలకవర్గాలు తమ ఆధికార బలాన్ని గుప్పిస్తున్నాయి. ఆర్థిక ప్రభావాన్ని చూపుతున్నాయి. పోరాట చరిత్రకలిగిన కార్మికులను ప్రలోభపెడుతున్నారు. అధికార పక్షానికి చెందిన ‘పెద్ద’ తలకాయలు సింగరేణి బొగ్గు గనులు విస్తరించి వున్న ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పర్చుకున్నాయి. గత ఐదారు రోజులుగా కార్మిక వర్గానికి మందు, మాంసారాలతో విందులను ఏర్పాటు చేస్తున్నారు. 8 జిల్లాల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్లను ఎన్నికల వరకు బుక్‌ చేసుకున్నారు. ఏకంగా అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. గనుల సమీపాల్లో నిత్యం మందు పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ మందు పార్టీల్లో పాల్గొని ఇళ్లకు చేరుకునే కార్మికులు అనేక ప్రమాదాలకు గురవుతుండగా, డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించే పోలీసు అధికారులను ఎన్నికల వరకు ఆ డ్యూటీని పక్కకు పెట్టాలని…పోలీసు అధికారులను అధికార పక్ష ప్రతినిధులు హుకూం జారీ చేశారు. ఈ ఎన్నికల్లో మిగిలిన ట్రేడ్‌ యూనియన్ల నాయకత్వంపై అవసరమైతే ఉక్కుపాదం మోపి, తమ అనుబంధ టీబీజీకేఎస్‌ గద్దెనెక్కించాలని అధికార పక్ష అధినేత కేసీఆర్‌ కోల్‌బెల్ట్‌ ప్రాంత ప్రజా ప్రతినిధులను ఆదేశించినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. సింగరేణిలో ఉండే జయాపజయాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ఇంటిలిజెన్స్‌ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. సింగరేణి యాజమాన్యంలోని అధికార గణాన్ని కార్మికుల ఓట్లు అధికార పక్షానికి వేయించాలని ఆదేశించారు. ఆ దిశలో అధికారులతో పాటు గనుల్లో కీలకపాత్రగా ఉండే రైటర్లు సైతం ఓట్లను వేయించే పనిలో నిమగ్నమైనట్టు ఆరోపణలున్నాయి. ప్రతి రోజు… ప్రతి గనికి ఒక్కోక్క షిప్టులో విందు కోసం రూ.2లక్షలు సరాసరి అధికార పక్షం ఖర్చు చేస్తున్నట్టుగా వినికిడి. అక్టోబర్‌ 3న ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్‌ 5కు ముందు నాలుగైదు రోజులు నోటుతో ఓటును కైవసం చేసుకోవడానికి అధికార పార్టీ నోట్లను వెదజల్లడానికి రంగం సిద్ధం చేసినట్టు ప్రచారం జోరుగా ఉంది. ఇంత జరుగుతున్నా… ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో బహిరంగంగా మంటగలుస్తున్నప్పటికి…. ఓ వైపు సింగరేణి యాజమాన్యం, మరో వైపు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ప్రేక్షకపాత్ర వహించడం… ఈ ఎన్నికల ప్రచారంలో జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై తగు సాక్షాధారాలతో కొందరు న్యాయస్థానం మెట్లెక్కనున్నట్టు… ? కొసమెరుపు.