12 రాష్ట్రాల్లో అంధకారం
తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో కుప్పకూలిన పవర్‌ప్లాంట్లు అంధకారంలో 12 రాష్ట్రాలు!
న్యూఢిల్లీ, జూలై 31 : మరోమారు ఉత్తరభారతదేశం అంధకారంలో కూరుకుపోయింది. తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం ఉదయం నుంచి మొత్తం 12 రాష్ట్రాల్లో అంధకారం అలుముకుంది. ఉత్తరాది పవర్ గ్రిడ్ విఫలమవ్వడం.. సోమవారం నాడు పునరుద్దరించడం తెలిసిందే. అయితే అది జరిగి 15 గంటలు కూడా కాకముందే మరోమారు తూర్పు, ఉత్తర పవర్‌గ్రిడ్‌లు కుప్పకూలాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీలో లోకల్ రైళ్లన్నీ నిలిచిపోయాయి. మరో 300 ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ఐటి, సమాచార, తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. పరిశ్రమల్లో పనులు నిలిచిపోయాయి. పలు కార్యాలయాల్లో సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగైదు గంటల్లో విద్యుత్ సరఫరా మెరుగవుతుందని చెప్పారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పశ్చిమబెంగాల్, అస్సోం, పంజాబ్, జమ్మూకాశ్మీర్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్,తదితర రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.