పీసీసీ అధ్యక్షులతో 13న భేటీ కానున్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 13న సీఎల్పీ నాయకులు, పీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఆహార భద్రత బిల్లుపై వీరితో చర్చించనున్నారు. దేశంలోని మైడింట రెండు వంతుల మందికి సబ్సిడీపై తిండిగింజలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ భారీ పథకాన్ని అమలు చేసేందుకు యూపీఏ ప్రభత్వం ఇటీవల ఆర్డినెన్స్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంతకం కూడా చేశారు. మరో ఆరు నెలల్లో ఈ పథకం అమల్లోకి రానుంది.
మరోవైపు ఆహారభద్రత బిల్లుపై పార్లమెంట్‌లో చర్చకు సిద్దపడకుండా హడావుడిగా ఆర్డినెన్స్‌ జారీ చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. దీన్ని రాజకీయ జిమ్మిక్కుగా వర్ణించారు. గత తొమ్మిదేళ్లుగా ఈ బిల్లును తొక్కిపెట్టి పార్లమెంట్‌లో చర్చకు రాకుండా చేసి ఇప్పుడు హడావుడిగా ఆర్డినెన్స్‌ జారీ చేయడం పట్ల ఆశ్చర్య వ్యక్తం చేశాయి.