17న శబరిమల వస్తా

తృప్తి దేశాయ్‌ ప్రకటనతో మరోమారు ఉద్రిక్తత

తిరువనంతపురం,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఈ నెల 17న కేరళలోని శబరిమల ఆలయాన్ని దర్శించుకోనున్నట్టు మహిళా హక్కుల కార్యకర్త, భూమాత బ్రిగేడ్‌ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్‌ ప్రకటించారు. ప్రతియేటా రెండు నెలల పాటు జరిగే మండల దీక్ష కోసం ఈ నెల 17న శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు. అదేరోజు తాను శబరిమలలో అడుగుపెడతానంటూ తృప్తి దేశాయ్‌ ప్రకటించడంతో మళ్లీ ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనేలా ఉంది. అన్ని వయసుల మహిళలకు శబరిమలలో ప్రవేశం కల్పిస్తూ సెప్టెంబర్‌ 28న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం నిన్న తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్లపై జనవరి 22న విచారణ జరగాల్సి ఉన్నందున అప్పటి వరకు వేచి చూడాల్సిందేనని స్పష్టం చేసింది.కాగా తాను శనివారం శబరిమలకు వస్తున్నట్టు ఇప్పటికే కేరళ ప్రభుత్వానికి ఆమె లేఖరాశారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు అనుమతి మేరకు మేము శబరిమల వస్తాం. ఆలయంలోకి ప్రవేశిస్తాం.. అంటూ మరో ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. పుణెళికి చెందిన తృప్తి దేశాయ్‌… ‘భూమాత రంరాగిణి బ్రిగేడ్‌’ను స్థాపించారు. మహారాష్ట్రలోని అహ్మదాబాద్‌ జిల్లా శని సింగణాపూర్‌ ఆలయంలోకి మహిళలను అనుమతించాలంటూ పోరాడి విజయం సాధించారు.