17 నుంచి బర్రెల పంపిణీకి ఏర్పాట్లు

లబ్దిదారులను గుర్తించిన అధికారులు

జనగామ,ఆగస్టు13(జ‌నం సాక్షి): ముల్కనూర్‌లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ శనివారం బర్రెల పంపిణీ పథకం ప్రారంభించిన నేపథ్యంలో జిల్లాలో ఆగస్టు 17 నుంచి కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో బర్రెల పంపిణీ పథకం కింద ప్రభుత్వం రూ.10 కోట్ల సబ్సిడీ నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లాలో ఈ పథకం కింద 12,092మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ-లాబ్‌ అనే యాప్‌ ద్వారా సభ్యుల వివరాలు ఆన్‌లైన్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బర్రెల పంపిణీ పథకం ద్వారా మరింతగా పాడిపరిశ్రమ వృద్ధిలోకి వచ్చే అవకాశముంది. దీంతో జిల్లాలో రోజువారీ పాల సేకరణ రికార్డు స్థాయికి చేరేఆస్కారం ఉన్నట్లు డెయిరీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పాడి ఉత్పత్తి ద్వారా వేలాదిమంది రైతులు లబ్ధిపొందుతున్నారు. జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ ద్వారా రోజుకు సుమారు 34 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. ఆ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు జిల్లాలో మూడు మినీ పాల శీతలీకరణ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. బర్రెల పంపిణీలో ఎస్సీ, ఎస్టీలకు 75శాతం సబ్సిడీ, ఇతరులకు 50 శాతం సబ్సిడీ కింద బర్రెలు, ఆవులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు లబ్ధిదారుడు వాటా ధనంగా ఎస్సీ, ఎస్టీలైతే రూ. 20 వేలు, ఇతరులైతే రూ.40వేలు డీడీ తీసి సంబంధిత డెయిరీ అధికారులకు అందించాల్సి ఉంటుంది. డెయిరీ అధికారులు సం బంధిత డీడీలను పరిశీలించి పశుసంవర్థకశాఖ ఏడీకి అందజేస్తారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు లబ్ధిదారుడి ఇష్టం మేరకు బర్రె లేదా ఆవును కొనుగోలు చేస్తారు. బర్రె కొనుగోలు నిమిత్తం రవాణా ఖర్చులకు రూ.5 వేలు అదనంగా చెల్లిస్తోంది. అంతేగాకుండా ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్‌ ధర రూ.80 వేలలో బర్రె లేదా ఆవు విలువ, రూ. 4700లు మూడేళ్ల పాటు బీమా, 3నెలలకు సరిపోయే 300 కిలోల దాణా ఉంటుంది. జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. విజయ డెయిరీ అధికారులు జిల్లాలో ఇప్పటి వరకు ఐడీబీఐ బ్యాంకు ద్వారా రూ.4కోట్ల రుణాలు ఇప్పించి 800 పశువులు కొనుగోలు చేయించారు. అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా 400 పశువుల కొనుగోలకు గానూ రూ. 2 కోట్ల రుణాలు ఇప్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతేగాకుండా డెయిరీ ద్వారా పశువులకు నాణ్యమైన దాణా సరఫరా చేస్తున్నారు.