18 మైనింగ్‌ సంస్థలపై నిషేధం ఎత్తివేత

కర్ణాటకలో మళ్లీ మొదలుకానున్న గనుల తవ్వకాలు
సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి):కర్ణాటకలో గనుల తవ్వకాలపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఎత్తివేసింది. లీజు ఒప్పందాలను తు.చ. తప్పకుండా పాటించాలని మైనింగ్‌ సంస్థలను ఆదేశించింది. ఏ కేటగిరిలో ఉన్న మైనింగ్‌ సంస్థలు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, కార్యకలాపాలు నిర్వహిం చుకునేందుకు వాటిని అనుమతించాలన్న కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) సిఫార్సులను జస్టిస్‌ ఆఫ్తాబ్‌ ఆలం నేతృత్వంలోని త్రిసభ్య ధర్మా సనం అంగీకరించింది. అయితే, మిగతా సంస్థల పై యథావిధిగా నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. బళ్లారి అటవీ ప్రాంతంలో ఏ కేటగిరిలో ఉన్న 18 మైనింగ్‌ సంస్థలపై ఏడాది కాలంగా అమలులో నిషేధాన్ని అత్యున్నత న్యా యస్థానం తొలగిస్తూ.. మైనింగ్‌కు అనుమతిం చింది. దీంతో మళ్లీ ఏటా 5 మిలియన్‌ టన్నుల ఇనుము ఉత్పత్తి కానుంది. పర్యావరణ పరిస్థి తుల నేపథ్యంలో కర్ణాటకలో గనుల తవ్వకాలపై సుప్రీంకోర్టు గతంలో నిషేధం విధించింది. అయితే, ఏడాది తర్వాత ఆ నిషేధాన్ని న్యాయ స్థానం ఎత్తివేసింది. అయితే, పర్యావరణ, పునరా వాస కార్యక్రమాలను కాల పరిమితితో పూర్తి చేస్తామని మైనింగ్‌ సంస్థలు హావిూ ఇవ్వాలని కోర్టు షరతు విధించింది. అలాగే, అటవీ, పర్యావరణ అనుమతులు ఉంటేనే గనుల తవ్వకాలు చేపట్టాలని ఆదేశించింది. గనుల తవ్వకాలకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థ (పీసీబీ) అనుమతులు తప్పనిసరి అని మార్గనిర్దేశకాలు జారీ చేసింది. గనుల సంస్థలు ఇచ్చే హావిూ పత్రాలపై పీసీబీ సంతృప్తి చెందిన తర్వాతే తవ్వకాలు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సాధికారిక కమిటీ గనులను మూడు రకాలుగా వర్గీకరించింది. నిబంధనలను ఉల్లంఘించని సంస్థలను ఏ కేటగిరీలో చేర్చించింది. కనీస నిబంధనలు కూడా పాటించని సంస్థలను సీ కేటగిరీలో ఉంచింది. ఏ కేటగిరీలోని మైనింగ్‌ సంస్థలకు అనుమతి ఇవ్వాలని సీఈసీ సిఫార్సు చేయడంతో.. సుప్రీంకోర్టు ఈ మేరకు అనుమతించింది.
పర్యావరణ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా గనులు తవ్వున్నారని సుప్రీంకోర్టు గతేడాది కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ, తూముకూరు జిల్లాల్లో మైనింగ్‌పై నిషేధం విధించింది. దీనిపై విచారణ జరిపేందుకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు నిషేధం విధించడంతో ఒక్కసారిగా ఇనుము ఉత్పత్తి భారీగా పడిపోయింది. భారత్‌ ఏటా 200 మిలియన్ల టన్నలు ఇనుమును ఉత్పత్తి చేస్తుండగా, అందులో సగం విదేశాలకు ఎగుమతి అవుతోంది. అయితే, కోర్టు ఆదేశాలతో ఇది చాలావరకూ తగ్గిపోయింది. మరోవైపు, ఉత్పత్తి తగ్గి ఇనుము ధర అమాంతం పెరిగింది. అయితే, తాజాగా కోర్టు నిషేధం సడలించడంతో పరిస్థితిలో మార్పు రానుంది. మరోవైపు, కోర్టు తాజా ఉత్తర్వులపై భారత గనులు, పరిశ్రమల సంస్థ సెక్రటరీ జనరల్‌ ఆర్‌కే శర్మ హర్షం వ్యక్తం చేశారు. మిగతా కేటగిరీలోని గనులు కూడా త్వరలోనే మైనింగ్‌ ప్రారంభమవుతుందని ఆకాంక్షించారు.