2014 వరకు యూపీఏతో చెలిమి : ప్రఫుల్‌పటేల్
ముంబయి, జూలై 23 (జనంసాక్షి): 2014 ఎన్నికల వరకు యుపిఎతో జతగానే కొనసాగుతామని ఎన్‌సిపి నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. సోమవారంనాడు ఎన్‌సిపి నేతల సమావేశం జరిగింది. మంగళవారం మరో మారు సమావేశం కానున్నది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం నాటి సమావేశంలో తమ వైఖరి ఎలా ఉండాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో తమకు ఎటువంటి విభేదాల్లేవన్నారు. తాము యుపిఎతో కలిసే ఉన్నామని తెలిపారు. మహారాష్ట్రలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం సజావుగా పరిపాలన కొనసాగించాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని చెప్పారు. సోమవారం జరిగిన సమావేశంలో మహారాష్ట్రలోని తమ పార్టీకి చెందిన వారు పాల్గొనలేదన్నారు. రేపటి సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. వారితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తమ అధినేత, కేంద్ర మంత్రి శరద్‌పవార్ ఇప్పటికే చాలా విషయాలను ప్రధాని మన్మోహన్ దృష్టికి తీసుకు వెళ్లారని తెలిపారు.