ఈనెల 18న వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
జనంసాక్షి, మంథని : ఈ నెల 18 నుండి శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవములు ఘనంగా ప్రారంభం కానున్నాయి. వినాయక చవితి అనేది సమాజాన్ని మేలుకోల్పడానికి మనిషిలో మానవత్వాన్ని పెంపొందించడానికి జరుపుకునే గొప్ప పండుగ చెప్పవచ్చు. మత విశ్వాసంతో కూడిన మంచి పనులు చేయవచ్చు అని చెప్పడానికే వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టి ద్వారానే వినాయకుని విగ్రహానికి పూజలు చేయాలని శాస్త్రాల్లో చెప్పబడింది. అలాగే ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయాలని అనంతరం తొమ్మిది రోజులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలని పేర్కొనబడింది. ఈ 21 పత్రాలు అనేవి సాధారణమైనవి కావు. చాలా శక్తివంతమైన ఔషధములు. వర్షాల వల్ల జలం కలుషితం కాకుండా కొత్త మట్టితో చేసిన వినాయక ప్రతిమను జలంలో నిమజ్జనం చేయడం ద్వారా ఆ జలానికి ఎంతో శక్తి వస్తుందని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ముఖ్యంగా శ్రీ విగ్నేశ్వర స్వామిని 21 రకాల ఆకులతో పూజిస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ 21 రకాల పత్రాలు ఏమనగా మాచి పత్రం, బృహతీ పత్రం, బిల్వపత్రం, దూర్వా పత్రం, దుత్తూర పత్రం, బదరీ పత్రం, అపామార్గ పత్రం, తులసి పత్రం, చూత పత్రం, కరవీర పత్రం, విష్ణు క్రాంత పత్రం, దాడిమీ పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం, జాజి పత్రం, గండలి పత్రం, శమీ పత్రం, అశ్వత్థ పత్రం, అర్జున పత్రం మొదలగు 21 పత్రాలతో విఘ్నేశ్వరుని పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం. శ్రీ విఘ్నేశ్వరునికి కూడా శ్రీ మహావిష్ణువు లాగానే కొన్ని అవతారములు ఉన్నవి అని పురాణాల్లో చెప్పబడింది. శ్రీ విఘ్నేశ్వరునికి ఏకదంతుడు, గజాననుడు, వక్ర తుండుడు, మహోదరుడు, విజ్ఞ రాజు, వికటుడు, ధూమ్రా వర్ణుడు, లంబోదరుడు అనే అవతారములు ఉన్నాయి లోకకళ్యాణార్థమై విగ్నేశ్వరుడు ఈ అవతారంలో ఎత్తినట్లుగా పురాణాల్లో చెప్పబడింది. ఈసారి వినాయక చవితి ఉత్సవాలు 18న సోమవారం నుండి ప్రారంభించాలని ఉభయ తెలుగు రాష్ట్రాలు నిర్ణయించడం అయినది. పూర్వ గణితం పంచాంగం ప్రకారం వినాయక చతుర్థి తదియతో కూడిన చవితి శ్రేష్టం అని రచించబడింది. 18వ తేదీ సోమవారం ఉదయం 9.58 నిమిషాలకు చవితి ఆరంభమై 19న మంగళవారం రోజున ఉదయం 10.28 నిమిషములకు ముగుస్తుంది. అంటే మధ్యాహ్న కాలం ఉదయం గంటలు 10.57 నుండి పగలు 1.23 వరకు ఉంటుంది) అందుకే సోమవారం రోజునే వినాయక చవితి నిర్వహించాలని నిర్ణయించడం అయినది.