రజాకార్ టైలర్ సినిమాను నిషేధించాలి
* సినిమాల్లో అవాస్తవాల చిత్రీకరణ
* మత విద్వేషాలకు బీజేపీ ఆజ్యం
విలేకరుల సమావేశంలో జూలకంటి
మిర్యాలగూడ, జనం సాక్షి.
బిజెపి నాయకుల సారధ్యంలో విడుదల కాబోతున్న రజాకార్ల టైలర్ సినిమాను నిషేధించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కులం, మతం రంగు పూస్తున్నారని ఆరోపించారు. అది వర్గ పోరు మాత్రమేనని పేదలు భూస్వాములు మధ్య జరిగిన పోరాటమని తెలిపారు. నైజాం నవాబులు పాలించిన రాజ్యంగా ఉన్నప్పటికీ పేదల పక్షాన అన్ని వర్గాల ప్రజలు విరోచితంగా పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. దానిని మతం మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను పక్కనపెట్టి అవాస్తవాలతో చిత్రీకరించి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఇలాంటి సినిమాలు విడుదల కావడం వల్ల ప్రజల్లో విభేదాలు వస్తాయని వెంటనే ఆ సినిమాను సెన్సార్ బోర్డు నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆనాడు జరుగుతున్న పోరాటంలో ఆర్ఎస్ఎస్ నైజాం నవాబుకు అనుకూలంగా వివరించారని స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్లకు సహకరించారని ఆరోపించారు. తెలంగాణలో ప్రజలందరూ సమరస్యంగా జీవిస్తున్నారని ఇలాంటి ప్రజల మత విద్వేషాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. విభేదాలు సృష్టించే సినిమాలను సెన్సార్ బోర్డు నిషేదించాలని కోరారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం శుభపరిణామమని సాకులు చూపి బిల్లు అమలు కాకుండా చూసిన, ఆటంకాలు సృష్టించిన ఊరుకోబోమన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే మహిళా బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత జరగబోయే ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ను అమలు చేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులు లేకుండా చట్టానికి పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర యూనిట్ గా దామాషా పద్ధతిలో ఎన్నికలు జరిపి పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లను కేటాయించాలన్నారు. దీనివల్ల ఎన్నికల వ్యయం పూర్తిగా తగ్గిపోతుందన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి మూడవత్ రవి నాయక్, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతంరెడ్డి రాగిరెడ్డి మంగారెడ్డి, నాయకులు కందుకూరి రమేష్, లక్ష్మీనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.