రాష్ట్రంలో 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోందని వివరించింది. కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఈ రెండు ప్రాంతాలతోపాటు రాయలసీమలోనూ అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అందువల్ల సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.