ఆకాల వర్షాలతో 6వేలహెక్టార్ల పంట నష్టం!

ఆదిలాబాద్‌, మార్చి 15  : ఇటీవల కురిసిన ఆకాలవర్షాలు, వడగళ్ల వానకు జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని ఎట్టకేలకు జిల్లా వ్యవసాయశాఖ   ప్రాథమిక నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేసింది. జిల్లాలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలు, వడగళ్ల వానతో 5,688వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని  అంచనా వేసింది. ఇప్పటికే జిల్లాలోని ఆయా మండలాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారులు నివేదికను తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా 17మండలాల్లో మిర్చి, పసుపు, మొక్కజొన్న తదితర పంటల వల్ల రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి కారణంగా జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. అతివృష్టి, అనావృష్టితో రైతులకు పంటలు చేతికి అందడం లేదు. రైతుల పట్ల ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు వాపోతున్నారు. పెరిగిన వ్యవసాయ పెట్టుబడులతో తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతున్నామని, రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.