టెలిగ్రాం సేవలకు నేడే ఆఖరిరోజు

న్యూఢిల్లీ: టెలిగ్రాం సేవలు ఆదివారం నుంచి అగిపోనున్నాయి. 160 ఏళ్లుగా భారతీయుల జీవితాల్లో భాగంగా మారిన ఈ సేవలు శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. ”టెలిగ్రాం సేవలకు ఆదివారమే చివరి రోజు. ఉదయం 8గంటలకు సేవలు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగుస్తాయి. సోమవారం నుంచి అందుబాటులో ఉండవు.” అని బీఎస్‌ఎస్‌ఎల్‌ సీఎండీ ఉపాధ్యాయ చెప్పారు. అదాయం తగ్గిపోవడంతో సేవలు ఆపేయాలని నిర్ణయించారు. తొలిసారిగా ఎలక్ట్రిక్‌ టెలిగ్రాఫ్‌ లైన్‌ను ప్రయోగాత్మకంగా కోల్‌కతా, డైమండ్‌ ఓడరేవు మధ్య 1850లో ప్రారంభించారు. ఆ తర్వాతి సంవత్సరం ఈస్ట్‌ ఇండియా కంపెనీ వినియోగం కోసం ప్రారంభించారు. 1854లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలో వెయ్యి మంది ఉద్యోగులతో 75 టెలిగ్రాం కేంద్రాలున్నాయి. వీరందరినీ బీఎస్‌ఎస్‌ఎల్‌ తీసుకుని మొబైల్‌ ఫోన్‌ సేవలు, బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైన్‌ సేవల్లో ఉపయోగించుకోనుంది.