బీటలు వారిన కేదార్‌నాథ్‌ ఆలయ నిర్మాణం ఏఎస్‌ఐ ప్రాథమిక సర్వేలో వెల్లడి

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో గత నెలలో సంభవించిన వరద బీభత్సం  కారణంగా కేదార్‌నాథ్‌ ఆలయ నిర్మాణం అక్కడక్కడా బీటలు వారిందని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో తేలింది. అలయాన్ని పునరుద్ధరించేందుకు గాను ముందుగా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసే బాధ్యతను ఏఎస్‌ఐకి అప్పజెప్పారు. ముగ్గురు నిపుణులతో కూడిన ఏఎస్‌ఐ బృందం జులై 11న కేదార్‌నాథ్‌ సందర్శించింది. అనంతరం ఢిల్లీలోని ఉన్నతాధికారులకు తమ నివేదికను అందజేసింది. గర్భగుడికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడా బీటలు వారినట్లు కన్పించిందని నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా తూర్పు భాగంలో ఎక్కువ నష్టం సంభవించిందన్నారు. అలయ ప్రాంగణంలో ఇంకా 2 నుంచి 6అడుగుల ఎత్తు వరకు పేరుకుపోయిన రాళ్లు రప్పలు ఉన్నాయని అవన్నీ తొలగించాక కానీ పూర్తి నష్టాన్ని అంచనా వేయడం సాధ్యం కాదని నిపుణులు పేర్కొన్నారు. మరోసారి నిపుణుల బృందం అలయాన్ని సందర్శించి పూర్తి నష్టాన్ని అంచనా వేస్తుందని, ఆ తర్వాతే పునరుద్ధరణ చర్యలు ప్రారంభిస్తామని ఏఎస్‌ఐ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బి. ఆర్‌. మణి తెలిపారు.