ఈసారీ..ఆ రెండింటి మధ్యే పోరు!చాలాచోట్ల ముఖాముఖి..

అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు

న్యూఢిల్లీ, మార్చి 15:లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్‌-బిజెపి మధ్యే హోరాహోరీ పోరు కొనసాగనున్నదని రాజకీయ విశ్లేషకులు పలువురు అంటున్నారు. రంగంలో పార్టీలెన్ని ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌, బిజెపి మధ్యే ముఖాముఖి పోటీ జరగనున్నట్టు చెబుతున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే గాక.. ఇతరుల సీట్లను కూడా కైవసం చేసుకోవాలని బిజెపి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది. బిజెపి ఇప్పటికే లోక్‌సభ అభ్యర్థుల జాబితాలను మూడు విడతలుగా వెలువరించింది. కాంగ్రెస్‌ పార్టీ అయితే రెండు విడతలుగా వెల్లడించింది. రేపో మాపో మిగిలిన జాబితాలు వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీల ప్రతినిధులు కసరత్తు కొనసాగిస్తున్నారు.

బీహార్‌, గుజరాత్‌, మహరాష్ట్ర..లపై ప్రత్యేక దృష్టి

కమలనాధుల గురి  వాటిపైనే ప్రధానంగా ఉంది.ఉత్తరాదిన హిందీ మాట్లాడే ప్రాంతాలపైనా,గుజరాత్‌, మహరాష్ట్ర, కర్నాటకలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఆయా ప్రాంతాలనుండి బిజెపికి 154 సీట్లు గెలుచుకోవడం తెలిసిందే. అందుకే ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి.. ఓటు బ్యాంకు జారిపోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఉత్తరాదిలోని హిందీ భాషా రాష్ట్రాల్లో 226 ఎంపీ స్థానాలుండగా.. 1999 ఎన్నికల్లో 112 స్థానాలను గెలుచుకుంది. 80 ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌పై బిజెపి దృష్టి సారించింది. అయితే బిఎస్‌పి నుండి పోటీ ఎదురు కానున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  గెలుపు అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. 40సీట్లయినా పొందాలని బిజెపి భావిస్తోంది. ఆ దిశగా పావులు కదుపుతోంది. అదేవిధంగా బీహార్‌, జార్ఖండ్‌లపై కూడా దృష్టి సారించింది. బీహార్‌లో 40, జార్ఖండ్‌లో 14ఎంపి సీట్లున్నాయి. బీహార్‌లో 20 సాధించాలని, జార్ఖండ్‌లో 10సీట్లు సాధించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. అందుకు తగ్గట్టుగానే బీహార్‌లో 30 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనున్నట్టు తెలుస్తోంది. జార్ఖండ్‌లోని 14 ఎంపీ స్థానాల్లో కనీసం 10 సీట్లయినా సాధించాలనే తపనతో అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. హర్యానాలోని 10 ఎంపీ సీట్లలో కనీసం అయిదింటిని గెలుచుకోవాలని భావిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని అయిదు సీట్లను కూడా కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్రలోని 40 ఎంపీ స్థానాల్లో 20 గెలుచుకోవాలని పావులు కదుపుతోంది. కర్నాటకలో మొత్తం 28 ఎంపీ స్థానాలు కాగా.. వాటిల్లో 20 సాధించాలని యోచిస్తోంది.  ఇదిలా ఉండా బిజెపి పాలిత పెద్ద రాష్ట్రాలైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో ముఖాముఖి పోటీ నెలకొంది. కాంగ్రెస్‌-బిజెపి మధ్యే పోరు జరగనుంది.

వివిధ రాష్ట్రాల్లో..

వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 80, మహారాష్ట్రలో 48, ఆంధ్రప్రదేశ్‌లో 42, పశ్చిమ బెంగాల్‌లో 42, బీహార్‌లో 40, తమిళనాడులో 39, కర్నాటకలో 28, చత్తీస్‌గడ్‌లో 11, గుజరాత్‌లో 26, అసోంలో 14, మధ్యప్రదేశ్‌లో 29, రాజస్థాన్‌లో 25, గోవాలో 2, ఒడిసాలో 21, జార్ఖండ్‌లో 14, హర్యానాలో 10, హిమాచల్‌ప్రదేశ్‌లో 4, కేరళలో 20, జమ్మూకాశ్మీర్‌లో 6, పంజాబ్‌లో 13, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 2, మణిపూర్‌లో 2, మిజోరంలో 1, మేఘాలయలో 2, నాగాలాండ్‌లో 1, త్రిపురలో 2, ఢిల్లీలో 7, ఉత్తరాఖండ్‌లో 5 లోక్‌సభ స్థానాలున్నాయి.

ఏడుసార్లుగా సంకీర్ణాలే..

1984లో ఇందిరా మరణం అనంతరం జరిగిన ఎన్నికల్లో 404 స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంది. రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యారు. ఆ తరువాతి నుండి అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే. మెజారిటీకి అవసరమైన 272 స్థానాలను ఏ ఒక్క పార్టీ కూడా గెలుచుకోలేకపోయింది. దాంతో సంకీర్ణ ప్రభుత్వాలే పరిపాలనను కొనసాగిస్తున్నాయి. 1991లో కాంగ్రెస్‌కు 232 సీట్లు వచ్చాయి. 1999లో 182 సీట్లు మాత్రమే బిజెపి గెలుచు కోగలిగింది. తాజా ఎన్నికల అనంతరం కూడా సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

నాడు 60పైసలే.. నేడు..రూ.12!

1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల పోరులో ఒక్కో ఓటరుపై 60 పైసలు ఖర్చవ్వగా.. ఇప్పుడది 12 రూపాయలకు చేరుకుంది. తొలి సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం 10.45కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. 2009  ఎన్నికలకు 846.67 కోట్ల రూపాయలకు ఖర్చు చేరుకుంది.

అందరి దృష్టి ఆ నాలుగింటిపైనే..

ఆ నాలుగు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉండడంతోనూ.. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉండడం తోనూ ప్రధాన పార్టీలన్నీ ఆ నాలుగు రాష్ట్రాలపైనే దృష్టి సారించాయి. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు కాగా ఓటర్ల సంఖ్య 13.4 కోట్లు.. మహారాష్ట్రలో.. 48 లోక్‌సభ స్థానాలు కాగా.. 7.9 కోట్ల మంది ఓటర్లు.. పశ్చిమబెంగాల్‌లో.. 42 ఎంపీ స్థానాలు కాగా.. 6.3కోట్ల మంది ఓటర్లు.. ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ స్థానాలు కాగా 6.2కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పై నాలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 212 లోక్‌సభ సీట్లు కావడంతో వాటిల్లో అత్యధిక సీట్లు సాధించేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే దృష్టి సారించాయి. అంతేగాక గెలుపు అభ్యర్థులను రంగంలోకి దించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపు తున్నట్టు తెలిసింది.

తొలిసారిగా ‘నోటా’

ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా ఈవిఎంలలో ‘నోటా’ ఆఫ్షన్‌ను కూర్చారు. ఈ ఆప్షన్‌ను ఉపయోగించి తమ అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించొచ్చు. ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను ఉపయోగించిన ఎమ్మెల్యేగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిలవడం తెలిసిందే. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుండి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం విదితమే.