గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

పోలీసులను చూసి పరారైన దుండగులు

నెల్లూరు, మే 27 : జిల్లాలోని కొడవలూరు మండలం తలమంచి రైల్వే స్టేషన్ సమీపంలో దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. గత అర్థరాత్రి రెండు గంటల సమయంలో చెన్నై నుంచి వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్ ఎస్-1 బోగీలో దొంగలు చైన్ లాగి రైలును నిలిపివేశారు. ప్రయాణికుల వద్ద బంగారు ఆభరణాలను లాక్కునేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ ఎస్సై సుభానీ, ఇతర సిబ్బంది దొంగలను పట్టుకునేందుకు యత్నించారు.

పోలీసులను గుర్తించిన దొంగలు రైల్లో నుంచి దూకి పరారయ్యారు. దొంగలను వెంబడించిన పోలీసులు వారిని పట్టుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే పోలీసులకు చిక్కకుండా దొంగలు పరారయ్యారు. ఈ ఘటనలో రైల్లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొద్ది సేపటి తర్వాత రైలు యధావిధిగా బయలుదేరింది. చోరీకి యత్నించింది బీహార్‌కు చెందిన దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వే అసిస్టెంట్ కమిషనర్ పొన్నురాజు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.