హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 నుంచి 80 శాతం పోలింగ్ నమోదయ్యిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలో బుద్దభవన్‌లో కమిషనర్ ఎన్నికల తీరుపై మీడియాతో మాట్లాడారు. ఉదయం 7 గంటలకు మొదలైన ఎన్నికలు సాయంత్రం 5 వరకు కొనసాగుతాయన్నారు. పోలింగ్ కేంద్రాలలో 5 గంటలకు ముందుగా వచ్చి క్యూ లైన్లో నిలుచున్న వారి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 జడ్పిటిసిలు, 8,250 ఎంపిటిసి స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ శాతం పలు చోట్ల 70 నుంచి 80 శాతం నమోదయ్యిందని, మరికొన్ని చోట్ల 80 శాతంపైగా నమోదయ్యిందని కమిషనర్ పేర్కొన్నారు. స్వల్ప ఘర్షణలు మినహా రాష్ట్రంమంతా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టిడిపి, వైసిపిలు ఘర్షణలకు పాల్పడ్డాయన్నారు. ఇప్పటి వరకూ తమకున్న సమాచారం మేరకు మూడు ప్రాంతాలలో రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందని కమిషనర్ తెలిపారు. వాటిలో అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, నెల్లూరులోని కొవ్వూరులో, మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలలో రీపోలింగ్ నిర్వహంచే అవకాశముందన్నారు. కాగా ఎండకాలం కావడంతో మధ్యాహ్నం సమయంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యిందని, సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి ఈ శాతం మరింత పెరుగొచ్చని అన్నారు.