90 రోజుల్లో 90 వేల ఫోన్ల డేటా సేకరించిన గుజరాత్‌ పోలీసులు

ఢిల్లీ : గుజరాత్‌ పోలీసులు వివిధ కేసుల్లో విచారణ నిమిత్తం అని పేర్కొంటూ 90 రోజుల్లో 90 వేల ఫోన్ల కాల్‌ డేటా రికార్డులను సేకరించినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. విచారణ దర్యాప్తు సంస్థలు కాల్‌డేటా సేకరించడం సాధారణమేనని అయితే తక్కువ సమయంలో మరీ ఇంత ఎక్కువ రికార్డులు సేకరించడం అశ్చర్యానికి గురి చేస్తోందని, ఆ డేటా వారికి ఏమాత్రం ఉపయోగపడిందో తెలియదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అనధికారిక టెలిఫోన్‌ ట్యాపింగ్‌ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో సెంట్రల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను ప్రారంభించనుంది. అప్పుడిక ప్రభుత్వ సంస్థలైనా సరైన అనుమతులు పొందాకే కాల్‌డేటా సేకరించడానికి వీలవుతుంది.