సిట్ నోటీసులపై భగ్గుమన్న బిఆర్ఎస్

అడుగడుగున నిరసన జ్వాల.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
హత్నూర, ఫిబ్రవరి 2 (జనం సాక్షి)ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసిన ఘటనపై బిఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు.సిట్ నోటీసులను వ్యతిరేకిస్తూ మండలంలోని బోర్పట్ల, చింతల్ చెరువు,హత్నూర,నాగారం,దౌల్తాబాద్,బ్రాహ్మణ గూడ,వడ్డెపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.ప్రధాన రహదారులపై బైఠాయించి ధర్నా,రస్తారోకో నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ,సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.సిట్ నోటీసుల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందంటూ ఆరోపించారు.రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పై దుమ్మెత్తి పోయడమే ఎజెండాగా పెట్టుకుందని వారు విమర్శన గళమెత్తారు.రాజకీయంగా దెబ్బతీయడం కోసమే కెసిఆర్ ను నిరాధారమైన కేసుల్లో ఇరికించి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ధ్వజమెత్తారు.మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధీ పొందాలన్న దురుద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కెసిఆర్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండలాద్యక్షుడు రామచంద్రారెడ్డి,ఎల్లయ్య,నవీన్ గౌడ్, శోభ రాణి,కృష్ణ గౌడ్,నరేందర్,పండుగ రవి,అజ్మత్, శ్రీకాంత్,సురేష్ గౌడ్,మెరాజ్,అనంత రామ్ రెడ్డి,మల్లేశం, కొప్పు పవన్ కళ్యాణ్,సిద్దుల ప్రభాకర్,అంబటి అర్జున్, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.



