EPFO ఖాతాదారులకు రూ.50వేల నజరానా

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO).. తన ఖాతాదారులకు తీపికబురు అందించింది. రిటైర్మెంట్ సమయంలో లాయల్టీ కింద సభ్యులకు రూ. 50 వేల రూపాయలు అదనంగా అందించనున్నట్టు ప్రకటించింది ఈ సంస్థ. ఇందుకోసం 20 ఏళ్లపాటు EPFOలో డబ్బులు జమచేసిన ఖాతాదారులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. రిటైర్మెంట్ సమయంలో మొత్తం సొమ్ముతోపాటు రూ. 50 వేలు కలిపి అందించనున్నారు.

EPFO లో 20 ఏళ్ల నుంచి డబ్బు జమ చేస్తున్న వారికి ఈ జీవిత ప్రయోజనం వర్తిస్తుందని తెలిపింది. తాజాగా జరిగిన ఈపీఎఫ్‌ ట్రస్టీస్‌ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. కనీస వేతనాన్ని అనుసరించి రూ. 5వేల వరకు ఉన్నవారికి రూ. 30వేలు,  రూ. 5వేల నుంచి రూ.10వేలమధ్య మూల వేతనం ఉన్న ఖాతాదారులకు రూ. 40వేలు ఆపైబడి ఉన్న వాళ్లకు రూ. 50వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది EPFO.

వచ్చే రెండేళ్లు ప్రయోగాత్మకంగా అందిస్తామని.. అనంతరం శాశ్వత ప్రాతిపదికన ఆలోచిస్తామన్నారు EPFO అధికారులు. దివ్యాంగ ఉద్యోగులకు 20ఏళ్ల కన్నా తక్కువ ఉన్నా రూ. 50వేలు అందిస్తామన్నారు. ఒక వేళ ఈపీఎఫ్‌ ఖాతాదారుడు మరణిస్తే.. రూ. 2.5 లక్షల కనీస బీమా డబ్బును అందిస్తామని తెలిపింది EPFO బోర్డు.

తాజావార్తలు