పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు గెలిచాయి.. నిలిచాయి

లోక్‌సభ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తిరస్కరించడం దేశ ప్రజల విజయం. ఈ బిల్లు పూర్తిగా అసంబద్ధమైంది. మహిళా రిజర్వేషన్ల చట్టానికి అందరూ అనుకూలమే.. కానీ బీసీ మహిళలకు సరైన న్యాయం జరగదనే అసలైన భయం ఉంది. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాల్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవాలి.

దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రించబడిందని, ఉత్తరాది రాష్ట్రాల్లో అక్కడున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా జనాభా పెరిగింది. 2026 జనాభా లెక్కలు ఇప్పుడు జరుగుతున్నాయని, ఇందులో కులగణన కూడా జరుగుతోంది. ఈ అంశాలపై కేంద్రం అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, దక్షిణాది రాష్ట్రాలు, బీసీలు నష్టపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించాలి. దేశ సమాఖ్య వ్యవస్థలో నియోజకవర్గాల పునర్విభజన ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదని, రాజకీయ సమానత్వం, ప్రాంతీయ సమతుల్యత, సామాజిక న్యాయం అనే మూడు స్తంభాలపై నిలబడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. డీలిమిటేషన్ ప్రతిపాదనలు, వాటికి అనుబంధంగా వచ్చిన రాజ్యాంగ సవరణ ప్రయత్నాలు, దక్షిణాది రాష్ట్రాల హక్కులపై ప్రభావం చూపేలా ఉన్నాయి. అభివృద్ధిని సాధించిన ప్రాంతాలకే నష్టం కలిగించే దిశగా అడుగులు పడడంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది.

దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాయి. కేంద్ర గణాంకాల ప్రకారం, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు సుమారు 2%కి పైగా ఉండగా, దక్షిణాదిలో అది 1.4–1.6% మధ్యకు పడిపోయింది. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారతలో ముందంజలో ఉండి జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేశాయి. లోక్‌సభలో మొత్తం సీట్లను 543 నుంచి 800కు పెంచుతామని కేంద్రం మాటిచ్చినప్పటికీ, ఆ పెంపు ఎలా విభజించబడుతుంది? ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు? అనే విషయాల్లో స్పష్టత లేదు. పార్లమెంటులో జరిగిన పరిణామాలు ఈ అనుమానాలను మరింత బలపరిచాయి. దాదాపు 22 గంటలపాటు జరిగిన చర్చలు, 250కి పైగా సభ్యుల అభిప్రాయాలు, చివరకు అవసరమైన 2/3 మెజార్టీ సాధించలేకపోవడం ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా ఉన్న సందేహాల తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. సామాజిక కోణంలో చూస్తే, ఈ పునర్విభజన బీసీ, ఓబీసీ, బలహీన వర్గాల ప్రాతినిధ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. 2027 జనగణనలో కుల గణన చేపడుతున్నప్పుడు, ఆ లెక్కలు వచ్చేవరకు వేచి బీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండ్ బలపడింది.

దేశ సంపద సృష్టిలో అగ్రభాగమైన బీసీల సమగ్రాభివృద్ధి, సంక్షేమం, రాజకీయ భాగస్వామ్యం పట్ల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఈ ప్రక్రియను అనుసంధానం చేయడం కూడా వివాదాస్పదమైంది. మహిళా సాధికారతకు 33% రిజర్వేషన్ ఇవ్వడం ఒక చారిత్రక నిర్ణయం అయినప్పటికీ, దానిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం పునర్విభజన ప్రమాణాలు ఏమిటి? సీట్ల పెంపు ఎలా విభజించబడుతుంది? బీసీ, ఓబీసీ వర్గాల ప్రాతినిధ్యం ఎలా రక్షించబడుతుంది? అనే అంశాలపై లిఖితపూర్వక హామీలు ఇవ్వాలి. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాలరాసే ఏ ప్రయత్నమైనా ప్రజల ప్రతిఘటనకు గురవుతుందనే విషయాన్ని కూడా కేంద్రం తెలుసుకోవాలి.

రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించకుండా కేంద్రం మోసానికి పాల్పడింది. అనేక కమిషన్లు బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని సూచించినా, అమలు చేయడంలో మాత్రం కేంద్రం ద్వంద వైఖరిని అవలంబిస్తోంది. మహిళా రిజర్వేషన్ల అంశంలో రాజకీయ ఎత్తుగడలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. వాటిల్లో బీసీ కోటాను ప్రకటించాలి. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణించారని, ఇక ముందు వాళ్ల ఆటలు సాగనివ్వబోము.

దుండ్ర కుమారస్వామి
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు,
బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్
9959912341